Take a fresh look at your lifestyle.

ఉద్యమాల గడ్డ.. డ్రగ్స్ కు అడ్డా కావద్దు

  • ఉద్యమాల గడ్డ తెలంగాణ డ్రగ్స్​, గంజాయి మహమ్మారికి అడ్డాగా మారొద్దు.
  • ఒక మొక్క గంజాయి మెలిచినా ఇట్టే కనిపెడతాం.
  • ఇకపై నిరంతరం ఎలైట్​ యాక్షన్​ గ్రూప్​ ఫర్​ డ్రగ్​ లా ఎన్​ ఫోర్స్​మెంట్ (ఈగల్​) నిఘా ఉంటుంది.
  • కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఆ యాజమాన్యాలపైన కూడా కేసులు.
  • తల్లిదండ్రులు, యాజమాన్యాలు, అధ్యాపకులు విద్యార్థుల నడవడికను గమనించాలి.
  • డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలతో నార్కోటిక్స్ బ్యూరో భేటీ కావాలి.
  • సీఎం రేవంత్​ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు. అందుకోసం అవసరమైతే ఎంతటి కఠిన నిర్ణయాలైన తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యమాల గడ్డ తెలంగాణ డ్రగ్స్​, గంజాయి మహమ్మారికి అడ్డాగా మారకూడదన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఒక మొక్క గంజాయి మెలిచినా ఇట్టే కనిపెట్టే “ఎలైట్​ యాక్షన్​ గ్రూప్​ ఫర్​ డ్రగ్​ లా ఎన్​ ఫోర్స్​మెంట్​ (ఈగల్​) ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ప్రపంచంతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.“అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” పురస్కరించుకుని గురువారం హైదరాబాద్​ లోని శిల్పకళా వేదిక ప్రాంగణంలో డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, తెలంగాణ వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో గతంలో ఉద్యమాలకు వేదికలుగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలు గంజాయి, మాదక ద్రవ్యాలకు వేదిక అయితే అది అందరికీ అవమానకరమన్నారు. చాలా మంది యువకులు డ్రగ్స్ బారిన పడి బలవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పాఠశాల, కాలేజీల్లో ఎక్కడైనా దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తెలపాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తుంటే యాజమాన్యాలు, అధ్యాపకులు కేవలం చదువు చెబితే చాలన్నట్టు భావించడం సరికాదని హితవు పలికారు. వాటిని నియంత్రించడంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుందన్నారు. కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఇక నుంచి వాటి యాజమాన్యాలపైన కూడా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. యాజమాన్యాలు, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థుల నడవడికను కూడా గమనించాల్సిందేనన్నారు. డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలతో ఒక సమావేశం నిర్వహించాలని నార్కోటిక్స్ బ్యూరో అధికారులను సీఎం ఆదేశించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో యువత 68 శాతం ఉందన్నారు. ఐటీతో సహా అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుంటే దెబ్బతీయడానికి, దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి డ్రగ్స్ మహమ్మారితో యువతను బలిగొనే కుట్రలు జరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ముందు వరుసలో నిలుచున్న పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ భారిన పడి యువత నిర్వీర్యమైపోతోందన్నారు.

  • డ్రగ్స్​ తో తెలంగాణలో కాలు పెడితే అంతే..

డ్రగ్స్‌తో ఎవరైనా తెలంగాణలో కాలు పెట్టాలంటే వందసార్లు ఆలోచించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఒక గడ్డి పరకైనా రాష్ట్రంలో అడుగుపెట్టినా వెన్ను విరుస్తామన్నారు. తెలంగాణలోని 1కోటి 50 లక్షల ఎకరాల్లో ఒక్క గంజాయి మొక్క మొలవొద్దన్నారు. ఒక్క గంజాయి మొక్క మొలిచినా ఈగల్​ (గద్ద)ఇట్టే పట్టేస్తుందన్నారు. ఈ గద్ద ఈరోజు నుంచే పనిచేస్తుందన్నారు. ఐటీ హబ్‌గా, ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణ గంజాయి, డ్రగ్స్‌ హబ్‌గా మారితే మనమంతా విఫలమైనట్టేనన్నారు. యువతను సరైన దిశగా నడిపించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. యువతను సరైన దిశలో నడిపించాలన్న ఉద్దేశంతోనే క్రీడా పాలసీని తెచ్చామన్న ఆయన వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రేపటి రోజున ఎవరైనా క్రీడల్లో శిక్షణ తీసుకోవాలంటే తెలంగాణ వెళ్లాలన్న పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నామని సీఎం వివరించారు. ప్రపంచంతో పోటీ పడే శక్తి, యుక్తి దేశంలో ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్​, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సినీనటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, హోం సెక్రెటరీ రవి గుప్తా, తెలంగాణ డీజీపీ జితేందర్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యాతో పాటు అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.