Take a fresh look at your lifestyle.

జడ్చర్ల బైపాస్ రోడ్డుకు నితిన్ గడ్కరీ పచ్చజెండా

  • ఎమ్మెల్యే వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.
  • ఎన్.హెచ్ 44, ఎన్.హెచ్ 167 అనుసంధానిస్తూ బైపాస్ రోడ్డు నిర్మాణం.
  • బైపాస్ రోడ్డు జడ్చర్ల అభివృద్ధిలో మైలు రాయి అవుతుందన్న ఎమ్మెల్యే.
  • ఎంపీ డీకే అరుణతో కలిసి గడ్కరీకి వినతి పత్రాన్ని సమర్పించిన అనిరుధ్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి జడ్చర్ల: జడ్చర్ల సమగ్రాభివృద్ధిలో భాగంగా జడ్చర్ల బైపాస్ రోడ్ ను నిర్మించాలన్న వినతిపై కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.సోమవారం తెలంగాణ పర్యటనకు వచ్చిన గడ్కరీని కన్హా శాంతివనం వద్ద జడ్చర్ల బైపాస్ రోడ్డు విషయంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి వినతిపత్రం సమర్పించామని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల- హైదరాబాద్ జాతీయ రహదారి నెంబర్ 44 ను, జడ్చర్ల-కల్వకుర్తి జాతీయ రహదారి నెంబర్ 167 తో అనుసంధానం చేస్తూ ఈ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరామని చెప్పారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన జడ్చర్ల అరబిందో ఫార్మా, విరిచో పెట్రో కెమికల్స్, హెటిరో, హిందూస్థాన్ అన్ లీవర్ లాంటి సుప్రసిద్ధమైన పరిశ్రమలకు నెలవుగా ఉన్న ఫార్మా సెజ్ కు కూడా కేంద్రమని అన్నారు. అలాగే నర్సీ మాంజీ యూనివర్సిటీ, స్వామి నారాయణ్ గురుకుల్, ఉడ్ ల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి విద్యా సంస్థలు ఉన్న ఎడ్యుకేషన్ హబ్ అని గడ్కరీకి వివరించారు. దీనితో పాటుగా అలంపూర్ జోగుళాంబ శక్తి పీఠం, మంత్రాలయం, గంగాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం లాంటి క్షేత్రాలకు వెళ్లడానికి కూడా జడ్చర్ల ప్రధాన రహదారి అన్నారు. 44 వ నెంబర్ జాతీయ రహదారి, 167 వ నెంబర్ జాతీయ రహదారి తో పాటుగా వనపర్తి- జడ్చర్ల వెళ్లే స్టేట్ హైవే నెంబర్ 23, రైల్వే డబుల్ లైన్ కూడా ఉందని కేంద్ర మంత్రికి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ కారణంగా జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుందన్నారు. ఈ రద్దీని నివారించడానికి నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 167 ను అనుసంధానిస్తూ 4 కి.మీ. బైపాస్ రోడ్డు నిర్మిస్తే సరిపోతుందని, ఇది జడ్చర్ల ప్రాంత అభివృద్ధిలో మరో మైలురాయి అవుతుందని నితిన్ గడ్కరీకి విపులీకరించారు. కాగా ఈ విషయంగా గడ్కరీ సానుకూలంగా స్పందించారని, జడ్చర్ల బైపాస్ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.