- బిఆర్ఎస్ నేతల అరెస్ట్
ముద్ర ప్రతినిధి, భువనగిరి : బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కాంగ్రెస్ యువజన నాయకులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తు ఆదివారం స్థానిక వినాయక చౌరస్తా వద్ద బిఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం నుండే పోలీసులు భువనగిరి నలువైపులా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భువనగిరికి వచ్చే దారుల వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని పరిశీలించి పంపించారు.

బిఆర్ఎస్ నేతలు పోలీసుల కన్నుగప్పి వినాయక చౌరస్తా వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డగించి అరెస్టు చేశారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నల్ల కండువాలతో ధర్నా చేయడానికి వస్తుండగా ఆయనను అడ్డుకోగా పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పైళ్ల శేఖర్ రెడ్డి అరెస్ట్ చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు.

అరెస్ట్ అయిన వారిలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ చైర్మన్ కొలుపుల అమరేందర్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, టిఆర్ఎస్ యూత్ నాయకులు పెంట నితీష్, నాగారం సూరజ్, మండల పట్టణ నాయకులు ఉన్నారు.