Take a fresh look at your lifestyle.

ట్రంప్​ నిర్ణయంతో… ఫోన్​ ట్యాపింగ్​ నిందితులు వెనక్కి వస్తారా..?

  • కేసులో కీలక పరిణామం
  • ట్రంప్​ సంతకంతో మారుతున్న పరిణామాలు
  • క్రిమినల్​ కేసుల్లో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని నిర్ణయం
  • మరోవైపు తిరుపతన్నకు ఊరట
  • సస్పెండ్ అయిన అదనపు ఎస్పీకి సుప్రీంకోర్టు బెయిల్
  • బెయిల్ ను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం
  • హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వినతి
  • కేసు పురోగతిపై వెస్ట్ జోన్ డీసీపీ సమీక్ష

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న ఇద్దరు ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో వలసదారులు, క్రిమినల్ కేసులో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రిమైండర్స్ లెటర్లను హైదరాబాద్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరగనుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేయనుంది. వీరిద్దరిని ఇండియాకు రప్పించేందుకు తాజా పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు పోలీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీరిపై బ్లూ, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. పాస్‌పోర్టు రద్దు, రెండు దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం సంబంధించిన లేఖలను పోలీసులు మరోసారి పంపనున్నారు. ఇప్పటికే ఇద్దరిపై ఎల్ఓసీలు జారీ చేయడంతో ఇండియాలో అడుగుపెట్టగానే హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో ఏ1గా ప్రభాకరరావు, ఏ6 గా శ్రవణ్ రావు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు , డీఎస్పీ ప్రణీత్ రావులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా.. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఒక కీలకమైన ఫైలుపై సంతకం చేశారు. అమెరికాలో తలదాచుకున్న ఇతర దేశాలకు చెందిన నేరస్తులు, క్రిమినల్ కేసులో నిందితులను ఆయా దేశాలను అప్పగించాలని ట్రాంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఆ ఫైల్‌పై సంతకం కూడా చేశారు. దీంతో ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఇండియా వదిలి అమెరికాలో ఉన్న ఏ1 నిందితుడు ప్రభాకర్‌రావు, ఏ6 నిందితుడు శ్రవణ్‌రావులను ఇండియాకు అప్పగించేందుకు అమెరికా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు చాలా సార్లు అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాశారు. వారిద్దరినీ తమకు అప్పగించాలని రెడ్ కార్నర్‌ నోటీసును కూడా జారీ చేశారు. వారి పాస్‌పోర్టులను కూడా రద్దు చేయాలంటూ అమెరికా ప్రభుత్వానికి పలు మార్లు లేఖలు రాశారు హైదరాబాద్ పోలీసులు. ఈ క్రమంలో ట్రంప్ సంతకంతో వచ్చే వారం పదిరోజుల్లో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇండియా అప్పగిస్తే ఈ కేసులో కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం చట్టం ప్రకారం మరోసారి అమెరికా ప్రభుత్వానికి హైదరాబాద్ పోలీసులు లేఖ రాసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులకు నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై పూర్తిస్థాయిలో అమెరికా ప్రభుత్వానికి హైదరాబాద్ పోలీసులు లేఖ రాసే అవకాశం ఉంది.

తిరుపతన్నకు ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ (సస్పెండెడ్) మేకల తిరుపతన్నకు కాస్త ఊరట లభించింది. ఆ కేసు విషయంలో పది నెలలుగా జైళ్లో ఉన్న తిరుపతన్న బెయిల్‌ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు చేసింది. పది నెలలుగా జైల్లో ఉన్న తిరుపతన్న ఈ కేసు విషయంలో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారని తెలిపింది. దాంతో పిటిషనర్ ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. ట్రయల్ కు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని పిటిషనర్ ను హెచ్చరించింది. సాక్షులను ప్రభావితం చేసినా, ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దకు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాస్ పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులు అన్ని ట్రయల్ కోర్టు ఇస్తుందని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ఫోన్ ట్యాపింగ్ లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే ఈ విచారణకు హజరయ్యారు. కాగా గతంలో బెయిల్ కోసం తిరుపతన్న హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బి.వి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తుకు నాలుగు నెలల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపారు. ఆధారాలు, డేటా ధ్వంసం చేసారని.. గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్‌‌ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో మిగతా సాక్షులను విచారించాలని, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కీలక నిందితుడు తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని లూత్రా కోర్టును కోరారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతి మీద వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సోమవారం సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ టీంతో భేటీ అయిన ఆయన తిరుపతన్న బెల్ మంజూరు వ్యవహారాన్ని అధికారులతో చర్చించారు. మరోవైపు విదేశాల్లో ఉన్న నిందితులని హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే పరారై అమెరికాలో సెటిల్ అయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ2 నిందితుడు భుజంగరావుకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల రిత్యా ఆయనకు నాంపల్లి క్రిమినల్‌ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Leave A Reply

Your email address will not be published.