Take a fresh look at your lifestyle.

షోరూం వద్దే రిజిస్ట్రేషన్స్

రాష్ట్రంలో కొత్త పాలసీ
కార్యాలయాల చుట్టూ తిరుగుడకు బ్రేక్

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు రవాణా శాఖ ఊరటనిస్తూ షోరూమ్‌లలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇకపై ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొన్న చోటే డీలర్ ఆన్‌లైన్‌లో ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలను అప్‌లోడ్ చేస్తారు. అధికారులు వీటిని పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కార్డు నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా యజమాని ఇంటికి చేరుతుంది. అయితే.. ఈ సౌకర్యం కేవలం వ్యక్తిగత వాహనాలకే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ మాత్రం పాత పద్ధతిలోనే ఆర్టీఓ కార్యాలయాల్లో జరుగుతుంది.దీంతో రాష్ట్రంలో వాహనదారులకు రవాణా శాఖ భారీ ఊరటనిచ్చింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. శనివారం (జనవరి 24) నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేరుగా షోరూమ్‌లలోనే ప్రారంభం అయింది.
వాహన కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న వ్యయప్రయాసలను తగ్గించేందుకు రవాణా శాఖ జనవరి 8న ఈ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి ఆదేశాల మేరకు ఐటీ అధికారులు కేవలం 15 రోజుల్లోనే దీనికి అవసరమైన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ నూతన విధానాన్ని శుక్రవారం హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఒక షోరూమ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతం చేశారు. జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ స్వయంగా హాజరై.. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన పత్రాలను వాహనదారుడికి అందజేశారు. షోరూమ్ వద్దే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి ఈ పద్ధతిని అనుసరిస్తారు. ముందుగా.. పత్రాల సేకరణ. వాహనదారుడు వాహనం కొనుగోలు చేసిన వెంటనే.. డీలర్ ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా పత్రాలు, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను సిద్ధం చేస్తారు. వీటిలో కొనుగోలుదారుడు ఏదైనా ఫొటో ఐడీ ప్రూఫ్ తో కూడిన అడ్రస్ డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాహనం ఫోటోలతో పాటు పైన పేర్కొన్న పత్రాలన్నింటినీ డీలర్ నేరుగా రవాణా శాఖ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తును రవాణా శాఖ అధికారులు వెంటనే పరిశీలించి.. రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహనదారుడి ఇంటి చిరునామాకు చేరుతుంది.
ఈ సౌకర్యం కేవలం ద్విచక్ర వాహనాలు, వ్యక్తిగత కార్లకు మాత్రమే వర్తిస్తుంది. లారీలు, బస్సులు వంటి ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ గతంలో లాగే నేరుగా ఆర్టీఓ కార్యాలయాల్లోనే జరుగుతుంది. ఉదయం కొన్న వాహనాలకు సాయంత్రంలోపు, సాయంత్రం కొన్న వాటికి మరుసటి రోజులోపు శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ఎప్పుడైనా షోరూమ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉంది. ఈ విధానం అమలుపై ఇప్పటికే 33 జిల్లాల రవాణా అధికారులకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల మధ్యవర్తుల బెడద తగ్గడమే కాకుండా.. ప్రజలకు ఎంతో సమయం ఆదా అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.