- ఈ నెల 30న గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు
- సీఎంది ఆహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్
- ఏడాది పాలనలో 12 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు
- ఈ సిఫాయిసులు తీసుకువచ్చిన పెట్టుబడులు చూసి మనకు ఆజీర్తి అయిందట
- కాంగ్రెస్ వి 420 హామీలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- అబద్దాలలో ఛాంపియన్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఈనెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మహాత్మాగాంధీ వర్ధంతి రోజున ఈ కార్యక్రమానికి చుట్టాలని తలపెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కప్పులు…తెప్పలుగా హామీలిచ్చిన రేవంత్ ప్రస్తుతం వాటిని అమలు చేయడంలో నేడు…రేపు… మండలం….గ్రామం అంటూ సాగిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించేలా పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలని ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ వర్ధంతి రోజున బాపును తలచుకుంటూ.. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుదామన్నారు. ఒరిజినల్ గాంధీ.. ఈ డూప్లికేట్ గాంధీ లకు బుద్ధి తెచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని విద్యార్ధి విభాగానికి సూచించారు. ఈ నెల 30 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతుందోని…. అందువల్ల 420 హామీలపై ప్రశ్నిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి వినత పత్రం ఇస్తూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల లోకి వచ్చి.. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేట్టు ఆదేశాలు ఇవ్వండంటూ వినతి పత్రం ఇద్దామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం చాలా కీలకపాత్ర పోషించిందన్నారు. నాడు వారి పోరాట పటిమ అందరికీ స్పూర్తి దాయకమన్నారు. అలాగే సమాజానికి మంచి చేయడంలో విద్యార్థి విభాగం ఎప్పుడూ ముందుండాలని, ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చామని, రాష్ట్రాన్ని అభివృద్ది పరిచామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడిచిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతా తిరోగతి వైపు పయనిస్తుందన్నారు. 5 మెడికల్ కాలేజీలు ఉంటే, బీఆర్ఎస్ హయంలో 33 కాలేజీలు చేశామన్నారు. మనం తీసుకొచ్చిన సంక్షేమ పధకాలు, అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుండడం సిగ్గుచేటన్నారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది లేదు…. కొత్తగా ఒక కంపెనీను ఏర్పాటు చేసిందన్నారు. పైగా ఈ సిపాయిలు తీసుకొచ్చిన పెట్టుబడులను చూసి.. మనకు అజీర్తి అయిందట అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై కాంగ్రెసోళ్లు పెట్టిన హోర్డింగ్‌లను చూసి ఏడ్వాలో.. నవ్వాలో అర్థం కావడం లేదన్నారు.
రాష్ట్రానికి పెట్టబడులు తెస్తే అందరికంటే ఎక్కువగా సంతోషపడుతామన్నారు. లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులు అని బిల్డప్ ఇచ్చుడు కాదు….కనీసం ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముడం లేదని…అందుకే ఈ పరిస్థితి అని కేటీఆర్ అన్నారు. ఆయనకు చేతనైతే ఎప్పుడు పెట్టుబడులు వస్తాయో చెప్పు.. యువతకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ చేసి చూపెడితే రేవంత్ సన్మానం కూడా చేస్తానని అన్నారు.
ఆదివారం కొడంగల్‌లో జరిగిన సభలో ఒకటే స్పీచ్‌లో రెండు మాటలు మాట్లాడిండు.. తెల్లారే వరకు అందరికి రైతు భరోసా పైసలు పడుతవి అని చెప్పిండు.. 15 నిమిషాల్లో మాట మార్చిండని విమర్శించారు. ఆయనను చూస్తుంటే అపరిచితుడు సినిమాలో రాము, రెమోలా ఉన్నాడని సెటైర్లు వేశారు. తెల్లారే వరకు డబ్బులు పడుతవి అని చెప్పి…. మళ్లీ మార్చి నెల 31వ వరకు అని అన్నాడన్నారు.ఈ డెడ్‌లైన్ ను కేవలం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసమేనని అన్నారు. సంవత్సర కాలంగా రేవంత్ పాలన…. ఆహా నా పెళ్లాంట సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ ను తలపించే విధంగా ఉందని మండిపడ్డారు.
కాంగ్రెసోళ్లు గోబెల్స్ వారసులన్నారు. ఒకటి కాదు ….రెండు కాదు… ఏకంగా 420 హామీలు ఇచ్చారన్నారు. ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చారన్నారు. విద్యార్థి డిక్లరేషన్ కూడా ఇచ్చారన్నారు. ఢిల్లీ నుంచి టూరిస్టులను తీసుకొచ్చి డిక్లరేషన్ల పేరిట ఊదరగొట్టారన్నారు. ఇవి నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్లను పట్టుకుని ఆఫిడవిట్లు తయారు చేశారన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఒట్లు పెట్టి డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. చివరకు గ్యారెంటీ కార్డులు పంచారన్నారు. జోసెఫ్ గోబెల్స్ వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.