Take a fresh look at your lifestyle.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల మౌలిక వసతుల అభివృద్ధికి సమన్వయంతో చర్యలు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 19:

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ,అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలలు ,అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు–ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలని ఆమె సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ఇప్పటికే పూర్తయిన పనుల వివరాలు, కొనసాగుతున్న పనుల జాబితాలను సంబంధిత అధికారులు వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

పాఠశాలల్లో మంజూరు చేసిన టాయిలెట్ల నిర్మాణం,మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్లు, మౌలిక సదుపాయాలు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లు వాటిని హెడ్‌మాస్టర్లకు అప్పగించాలని, వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని డి ఈ ఓ కు సూచించారు.

ఎస్‌హెచ్‌జి ఫెడరేషన్ భవన నిర్మాణ వివరాలను సంబంధిత అధికారులు తక్షణం అందించాలన్నారు . ఈజిఎస్ పల్లెల్లో అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలలలో కంపౌండ్ వాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈజిఎస్ లేబర్ చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజా‌గా ఎన్నికైన గ్రామ సర్పంచులు,ఉపసర్పంచులు గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా మండల పరిషత్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి సమన్వయంతో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో పీడీ డిడిఆర్డిఓ జ్యోతి, డిడబ్ల్యూఓ లలిత కుమారి, సీపీఓ బాలశౌరి, అదనపు డిఆర్డిఓ బాలరాజ్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు విద్యుత్ శాఖ, విద్యాశాఖ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.