- సంఘ్ పరివార్ నేపథ్యం అవసరం లేదు
- స్టేట్ ప్రెసిడెంట్ గా ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా కావొచ్చు
- 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి అభ్యర్ధులను నిలబెట్టాం
- హైడ్రా కొత్తదేమీ కాదు పేరు మాత్రమే మార్చారు
- బీఆర్ఎస్ పర్కా ఫ్యామిలీ పార్టీ
- కాంగ్రెస్ మాకు ప్రధాన రాజకీయ శత్రువు
- కాంగ్రెస్ సర్కార్ ను ప్రజలు నమ్మడం లేదు
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికీ ఎంపీ ఈటల రాజేందర్ అర్హుడేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ తమ పార్టీ నుంచి 4 ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. హుజూరాబాద్ బైపోల్, గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ, మల్కాజిగిరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఆయన టీ బీజేపీ పదవికి అర్హుడని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘ్ పరివార్ కు చెందిన వారే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేయాలనే నిబంధనలేమీ లేవన్నారు. అలాగని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారు ఉండొద్దనే నిబంధన కూడా ఏమీ లేదన్నారు. మరో వారం రోజుల్లో అన్ని జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తి అవుందని, ఆ తర్వాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉందని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ, అసలు ఏ పదవి లేని వారు కూడా కావచ్చన్నారు.
ఈ మేరకు శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే బీజేపీలో సంస్థగత ప్రక్రియ మొదలైందని, పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. తెలంగామలో 700 మండలాల కమిటీలకు గాను 650 కమిటీలు పూర్తి అయ్యాయని అన్నారు. కమిటీ అధ్యక్షులుగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. 33 శాతం రిజర్వేషన్లను పార్టీలోనే అంతర్గతంగా అమలు చేస్తున్నామని అన్నారు. గతంలో జిల్లా అధ్యక్షుల నియామకం డైరెక్ట్ గా జరిగేదని, ఇప్పుడు అలా లేదన్నారు. మండల కమిటీలకు వయస్సు నిబంధన ఉందని, యువరక్తం తమ పార్టీకి కలిసొచ్చే అంశమని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ బేస్ స్ట్రాంగ్ గా ఉండేందుకు ఇదొక కారణమని, ఇలాంటి పద్దతి ఏ పార్టీలోనూ లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని,మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక త్వరలో ఎన్నికలు జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గట్టి అభ్యర్ధులను రంగంలోకి దింపామన్నారు.
గ్రామాలను అభివృద్ధి చేసేది కేంద్రమే
కేంద్ర ప్రభుత్వమే గ్రామాలను అభివృద్ధి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శ్మశాన వాటికల నుంచి నరేగా నిధుల వరకు అన్ని కేంద్రప్రభుత్వమే పంచాయితీలకు అందిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులను పెండింగ్ లో పెట్టి , గ్రామ పంచాయతీల నిధులను పక్కదారి పట్టించిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవని, వాళ్లు గ్రామపంచాయతీలను ఏం అభివృద్ధి చేస్తారని? కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ అప్పుల కోసం ఎదురు చూస్తుందని ఆయన విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు సక్సెస్ ఫుల్ గా అమలుచేస్తామని ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెబుతున్నారని, ఆయన మాటలు అక్కడ ఎవరు నమ్మరని అన్నారు. ఉచితాలకు వ్యతిరేకమని బీజేపీ ఎన్నడూ చెప్పలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా హామీలు ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పారు. తెలంగాణలో 7 నెలలుగా వీధి దీపాల ఏర్పాటుకు నిధుల కొరత ఉందన్నారు. బీర్, బ్రాందీ అమ్మగా వచ్చిన నిధులను సైతం కాంగ్రెస్ డైవర్ట్ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
హైడ్రా కొత్త చట్టమేమీ కాదు
హైడ్రా అనేది కొత్త చట్టమేమీ కాదని, పేరు మారిస్తే అది కొత్త చట్టం ఎట్లా అవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. చెరువులను కబ్జా చేస్తే చర్యలు తప్పవనేది ముందు నుంచే ఉన్న చట్టమేనని అన్నారు. మూసీ సుందరీకరణ జరగాల్సిందేనని, కానీ పేదల ఇండ్లు కూల్చకుండా చేపట్టాలనేది తమ డిమాండ్ అన్నారు. మూసీ సుందరీకరణకు కేంద్ర సహకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో ఫస్ట్ ఫేస్ లో రూ. 1250 కోట్లు కేంద్రం ఇచ్చిందని, అది పూర్తి చేయకుండా అఫ్జల్ గంజ్ లో బీఆర్ఎస్ అడ్డుకుందని ఆయన ఆరోపించారు. అప్పుడు మజ్లీస్ కూడా మెట్రోను వ్యతిరేకించిందని, ఎలా కడతారో చూస్తానని అక్బరుద్దీన్ అన్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వాళ్లే ఇప్పుడు స్టాండ్ మార్చుకుని కట్టాలని కోరుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఆర్ ఆర్ ఆర్ లైన్ అలైన్మెంట్ లోనూ, కాంగ్రెస్ ఆర్ ఆర్ ఆర్ అలైన్మెంట్ లో చాలా మార్పులు ఉన్నాయన్నారు. ఎంపీ అసదుద్దీన్ ను ముస్లింలే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అసదుద్దీన్ పరిస్థితి పిట్టల దొరలాగా మారిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోడీని ఓడిస్తానని ఎంపీ అసదుద్దీన్ సవాల్ విసిరారని, అయితే 3 సార్లు మోడీ పీఎం అయ్యారన్నారు. రామజన్మభూమి నిర్మిస్తే అంతు చూస్తామన్నారని, కట్టి చూపించామన్నారు.
కాంగ్రెస్ మాకు ప్రధాన రాజకీయ శత్రువు
రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్ తమకు ప్రదాన రాజకీయ శత్రువు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఎవరైనా అంటే వాళ్ళ చెంప చెళ్ళుమనిపించాలని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అనేది ఫ్యామిలీ పార్టీ అని ఆయన విమర్శించారు. త్వరలో పది ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ అవుతాయని చెప్పడానికి బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఏమైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తా అని ఆన ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం వందలకొట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే స్టేషన్ లు నిర్మిస్తుంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెస్తుంటే ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ లు తీసుకొస్తే తన వార్త పత్రికల్లో మూడో పేజీలో సింగిల్ వార్తగా వస్తుందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే రేవంత్ రెడ్డి మేడ్చల్ వరకు మెట్రో అనగానే ఆ వార్తను బ్యానర్ వేస్తారన్నారు. తాము కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా పనిచేస్తున్నాం దాన్ని మీడియా గ్రహించాలని కిషన్ రెడ్డి కోరారు. వరంగల్ లోని టెక్స్ టైల్ పార్క్ కు ల్యాండ్ కావాలని, రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంటే పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన 211 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పగించలేదన్నారు. విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ ఫ్లాంట్ కు రూ.11,445 కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందన్నారు.
బొగ్గుగని కార్మికులకు కోటి చొప్పున బీమా
బొగ్గుగనుల్లో పనిచేస్తోన్న 6 లక్షల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున బీమా కల్పించబోతున్నామని ఆయన చెప్పారు. బొగ్గుగనుల కేటాయింపులను వేలాంపాట ద్వారా వేయాలని సూప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. గనులు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశమని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి హక్కు ఉండదన్నారు. ఇదిలావుండగా, ప్రయోగ్ రాజ్ కు ఈనెల 26 వరకు 13 వేల ట్రైన్ ట్రిప్పులు నడుస్తాయన్నారు. ప్రయోగ్ రాజ్ వెళ్ళేందుకు విమాన ఛార్జీలను కేంద్రం పెంచలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.