Take a fresh look at your lifestyle.

సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ధరఖాస్తు చేసుకోవాలి

  • భూ భారతిలో సాదా బై నామాలకు పరిష్కారం.
  • ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. శ్రీజ.
  • చెరువు మాధారం, కొత్త కొత్తూరు రెవెన్యూ సదస్సుల తనిఖీ.

పాలేరు, ముద్ర విలేకరి: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు.శుక్రవారం నేలకొండపల్లి మండలంలోని చెరువు మాధారం, కొత్త కొత్తూరు గ్రామాలలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ఆమె తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా భూ సమస్యలకు సంబంధించిన ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, నిర్వహిస్తున్న రిజిస్టర్లు, దరఖాస్తుదారులకు ఇస్తున్న రశీదులు, ఏ ఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయో పరిశీలించారు.సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేస్తున్న రైతులతో మాట్లాడారు.వారికి భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ రైతులకు తమ భూముల విషయంలో అభద్రతా భావానికి గురి కాకుండా జవాబుదారి తనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు.కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, ముటేషన్, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతాయని తెలిపారు. రైతులకు, అధికారులకు సులభంగా అర్ధం అయ్యేలా భూ భారతి చట్టం ఉందన్నారు.హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు భూ భారతిలో అవకాశం ఉందన్నారు.పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందన్నారు.భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేయవచ్చన్నారు.భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టంలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని ఆమె తెలిపారు.భూదార్ కార్డుల జారీ జరుగుతుందన్నారు.రైతులకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుందని పేర్కొన్నారు.గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని, మోస పూరితంగా హక్కుల రికార్డులు మార్చి, ఎవరైనా ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దుచేసే అధికారం చట్టంలో ఉందన్నారు.హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమిపై హక్కులు ఉండి రికార్డులో లేని వారు హక్కుల రికార్డులో నమోదుకు కొత్త చట్టం వచ్చిన సంత్సరం లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.చెరువు మాధారం గ్రామంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు సంబంధించి 160, కొత్త కొత్తూరు గ్రామానికి సంబంధించి 28 దరఖాస్తులు అధికారులు స్వీకరించారు.స్వీకరించిన దరఖాస్తులకు అధికారులు రశీదులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్డీసి, పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ అధికారి ఎం.రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీవో నర్సింహా రావు, నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ తఫజ్జుల్ హుస్సేన్, నాయబ్ తహసీల్దార్ ఇమ్రాన్, ఆర్ఐ లు శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.