బీబీనగర్, ముద్ర విలేకరి: మహిళలలో విస్తృతంగా ప్రబలుతున్న సెర్వికల్ క్యాన్సర్ తో పాటు, గర్భాశయానికి సంబంధించిన సమస్యలపై శుక్రవారం పలువురు మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తో పాటు బొమ్మలరామారంలోని ప్రాంతీయ వైద్యశాలలో ఈ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు సెర్వికల్ క్యాన్సర్ గుర్తించడానికి నిర్ణయించే పాప్ స్మియర్ పరీక్షను పలువురు మహిళలకు ఉచితంగా నిర్వహించారు. సమన్వయంతో ఈ అవగాహన సదస్సును నిర్వహించడంతో పాటు మహిళలకు, ముఖ్యంగా మహిళల బాగోగులను పట్టించుకునే ఆశా వర్కర్లకు గర్భాశయ వ్యాధులకు సంబంధించి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్వస్త నారీ స్వశక్త్ అభియాన్ -2025 పథకం కింద ఈ కార్యక్రమాన్ని ఎయిమ్స్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మహిళలలో వైద్యపరమైన అంశాలపై అవగాహనకు ప్రయత్నం చేస్తోంది.
సెర్వికల్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించగలిగితే నివారణ సులభమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా యవ్వనంలోని బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఎవరూ కూడా సెర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఈ వ్యాధి వివరాలు, ముందు జాగ్రత్తలు, ఇతర నివారణ చర్యలకు సంబంధించి ముద్రించిన కరపత్రాలను మహిళలకు పంపిణీ చేశారు. ఎయిమ్స్ తో పాటు బొమ్మలరామారంలోని ప్రాంతీయ వైద్యశాలలో కూడా ఈ శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ లోని గైనకాలజీ విభాగానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు.