- రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
ముద్ర,పానుగల్: గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం పానుగల్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి హాజరై మాట్లాడారు.రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ధరణితో చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని,భూ సమస్యలు పరిష్కారం కాక సతమతమయ్యారని అన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.గత ప్రభుత్వంలో నాయకుల స్వార్థం కోసం ధరణి చట్టాన్ని తీసుకువచ్చారని నిబంధనలు పెట్టడం మరిచారన్నారు.లోపభూయిష్టమైన ధరణి చట్టం వల్ల రైతులు పడుతున్న సమస్యలు, ఇబ్బందులను గమనించి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఆదరిస్తే ధరణి చట్టాన్ని బంగాళా ఖాతంలో పడేస్తామని హామీ ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేసి వాటిలోని మంచి అంశాలను, రెవెన్యూ అధికారులు, న్యాయ కోవిదులు, రైతులతో చర్చించి ధరణిలో ఉన్న సమస్యలు అన్నింటికి పరిష్కారం చూపే భూ భారతి చట్టాన్ని తీసుకరావడం జరిగిందన్నారు.పాస్ పుస్తకంలో ఏదైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదని,కానీ భూ భారతి చట్టంలో సవరించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. భూ భారతి చట్టంలో రూపాయి ఖర్చు లేకుండా తహసిల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ కు, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ అక్కడ కూడా న్యాయం జరగకుంటే సిసిఎల్ఏ లేదా ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసుకునే అవకాశం భూ భారతి లో కల్పించడం జరిగిందన్నారు.భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తే ముందుగా సర్వే చేయించి భూమి పటాన్ని పాస్ పుస్తకంలో ముద్రించడం జరుగుతుందన్నారు.గ్రామ రెవెన్యూ అధికారులను త్వరలోనే ప్రతి గ్రామానికి నియమించుకోవడం జరుగుతోందన్నారు.భూ భారతి చట్టాన్ని చిత్త శుద్ధితో అమలు చేసి రైతులకు న్యాయం చేసి సమస్యలు పరిష్కరించి రైతులకు అండగా నిలవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.భూభారతి పథకాన్ని వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు అభాసు పాలు చెయ్యాలని,ప్రజలను గందరగోళానికి గురిచేయాలని చూస్తున్నారన్నారు.ధరణి లో భూ సమస్యల పరిష్కారం కోసం చాలామంది రైతులు అర్జీలు పెట్టుకున్నారని అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాక సతమతమవుతున్నారని, భూభారతి పథకంలో ప్రతి భూ సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు.అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 64 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుండి మంజూరైన చెక్కులను మంత్రి జూపల్లి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు యాదయ్య,ఆర్డిఓ సుబ్రహ్మణ్యం,డిఆర్డిఓ ఉమాదేవి,DAO గోవింద నాయక్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో గోవిందరావు, మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు మాజీ జెడ్పిటిసి రవికుమార్,వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


