Take a fresh look at your lifestyle.

కలెక్షన్లు ఎక్కువ చూపించడం తప్పే … మాదంతా క్లీన్​ అకౌంట్​

  • ఐటీ దాడుల్లో మా దగ్గర రూ. 20 లక్షలే దొరికాయి

ముద్ర, సినిమా ప్రతినిధి : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆన్‌లైన్ బుకింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల విధానాలు కొనసాగుతున్నాయని, అయితే కలెక్షన్లను అధికంగా చూపించడం వంటి తీరు పరిశ్రమ మొత్తానికీ హానికరమని ప్రముఖ నిర్మాత, ఎఫ్​డీసీ చైర్మన్​ దిల్​ రాజు అన్నారు. కొంతమంది సినిమా కలెక్షన్లు ఎక్కువ చూపిస్తుండటంతో సమస్యలు వస్తున్నాయన్నారు. దీనిపై పరిశ్రమలోని పెద్దలు కలిసి చర్చించి మార్గదర్శకాలు నిర్ణయించుకోవాలన్నారు. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటిస్ జారీ చేసినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. నాలుగు రోజులపాటు తన ఇంట్లో జరిగిన ఐటి దాడుల గురించి మొదటిసారి దిల్ రాజు శనివారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఆయన నివాసం తోపాటు శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీస్, మరి కొంతమంది నిర్మాణ సంస్థల కార్యాలయాలపై అధికారులు సోదాలు చేశారన్నారు. సోదాల తర్వాత ఐటీ అధికారులు ఏం చెప్పారో.. తనిఖీల పంచనామాలో ఏం తేల్చారో క్లారిటీ ఇచ్చారు. ఆ డబ్బునే తనిఖీల పంచనామాలో ఐటీ అధికారులు తేల్చినట్టు చెప్పారు.

సోదాలు సాధారణం

వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు చాలా సర్వసాధారణం అని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. తమ లావాదేవీలన్నీ క్లీన్‌గా క్లియర్‌గా ఉన్నాయని, ప్రచారంలో ఉన్నట్లు ఏ కోట్ల రూపాయల నగదు తమ వద్ద లభించలేదని ఆయన స్పష్టం చేశారు. దాడుల సమయంలో దాదాపు రూ. 20 లక్షలలోపు మాత్రమే నగదు తమ వద్ద ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ద్వారా తమ కుటుంబం పేరు భంగం కలిగించకూడదని కోరారు. ఐటీ అధికారులు 24 క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలించారని, అన్నింటినీ రికార్డుల్లో ఉంచి చూశారని అన్నారు. ప్రొడక్షన్ సంస్థ నుండి లభ్యమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని అధికారులు తమకు తెలిపారని దిల్ రాజు తెలిపారు. తాము గత అయిదేళ్లుగా ఎక్కడా పెద్దగా పెట్టుబడులు పెట్టలేదని, అన్ని లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా చేయబడుతున్నాయని దిల్ రాజు పేర్కొన్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో లేదా సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమాలు లేవని, అధికారులు కూడా దీనిని ధృవీకరించారని చెప్పారు. ఐటీ దాడుల నేపథ్యంలో వచ్చిన ఆరోపణలు తప్పని తేల్చారు. అదేవిధంగా, తన తల్లి ఆరోగ్యం గురించి కూడా ప్రస్తావించారు. లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న తమ తల్లిపై తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమని తెలిపారు.

టార్గెట్​ కాదు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఉన్న తనను ప్రభుత్వం టార్గెట్​ చేసిందనడం తప్పన్నారు. తాను ఏమీ టార్గెట్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రైడ్ సాధారణంగా జరిగే ప్రాసెస్ అని, తమ ఆఫీసుల్లో ఈ విధమైన సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయ్యిందని, అందువల్ల రైడ్ చేశారని వివరించారు. మా దగ్గర భారీ ఎత్తున డబ్బు ఎవరి డాక్యుమెంట్స్ దొరికాయని కొంతమంది వార్తలు వేశారని, అదంతా అవాస్తవం అని కొట్టిపారేశారు. అగ్ర హీరోలకు చెందిన సినిమాలు విడుదలైన సమయంలో కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం ఇండస్ట్రీలో సహజంగా జరిగేదన్నారు. అది తప్పు అని, ఆ తీరును మార్చుకోవాలని, ఇండస్ట్రీ అంతా కూర్చుని ఆ అంశం మీద మాట్లాడతామన్నారు. మొదటి మూడు రోజులు వ్యక్తిగతంగా తనిఖీలు చేసి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారన్నారని, తనిఖీలకు సంబంధించి శుక్రవారం తమ కార్యాలయంలో ముగించారని ఆయన పేర్కొన్నారు. తన దగ్గర రూ.5 లక్షలు, శిరీశ్‌ దగ్గర రూ.4.5 లక్షలు, తన కుమార్తె ఇంట్లో రూ.6 లక్షలు, ఆఫీసులో రూ.2.5 లక్షలు ఇలా అందరి దగ్గర కలిపి రూ.20 లక్షలు మాత్రమే ఉన్నాయని, తమ దగ్గర ఏం తనిఖీ చేశారనేది ఐటీ అధికారులు పంచనామా చేసి లెటర్‌ ఇచ్చారన్నారు.

ఐటీ శాఖ ఆశ్చర్యపోయింది

ఒక్కో సినిమాకు సంబంధించి 24 క్రాప్ట్స్‌ లావాదేవీలకు సంబంధించిన వివరాలు తీసుకున్నారని దిల్‌ రాజు పేర్కొన్నారు. తమ సంస్థలో తనిఖీలపై ఐటీ శాఖ ఆశ్చర్యపోయిందన్నారు. తనిఖీల్లో దిల్‌ రాజు నుంచి ఏమేమో ఊహించుకున్నామని ఐటీ అధికారులే అన్నారన్నారు. తమ సంస్థలో తనిఖీలపై ఐటీ అధికారులు సంతృప్తి చెందారని వివరించారు. గడిచిన ఐదేళ్లలో లావాదేవీలపై తమ ఆడిటర్స్‌, ఐటీ శాఖ చూసుకుంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.