Take a fresh look at your lifestyle.

సింగరేణి గనులపై మైసమ్మ తల్లి బోనాల జాతర

యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: ఆషాఢ మాసం అమ్మవారి బోనాల జాతరలో భాగంగా, బుధవారం సింగరేణి రామగుండం ఓసిపి.త్రీ ప్రాజెక్టు కార్మికులు మైసమ్మ బోనాల జాతర నిర్వహించారు. ఉదయం ఈ ప్రాజెక్టు కార్మికులు ప్రాజెక్టు కృషి భవన్ ఆవరణలోని మైసమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన జాతరకు ముఖ్యఅతిథిగా వచ్చిన రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ ను, ప్రాజెక్టు ప్రధాన గేటు వద్ద, సింగరేణి ఏరియా యాజమాన్యం, కార్మికుల పక్షాన, ఏరియా జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య, ప్రాజెక్టు అధికారి ఉదయ్ హరిజన్, ప్రాజెక్టు కార్మికులు సాధారణంగా స్వాగతించారు. ఇక అక్కడినుండి ఆయన అమ్మవారి బోనాలు ఎత్తు కున్న శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుల్ల మధ్య ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి రామగుండం ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు పాడిపంటలు, సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో, ఆయు రారోగ్యాలతో చల్లంగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నాను. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోనాలు జాతర గురించి వివరించారు. అమ్మవారిని పూజించే పండుగ జులై మాసం ఆషాడంలో వచ్చే మొదటి ఆదివారంతో అమ్మవారి బోనాలు ప్రారంభమవుతాయని, ఈ పండుగ మొదటి రోజునుండి, నెల చివరి రోజువరకు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారని, ముఖ్యంగా మహిళలు ఈ పండుగను జరుపుకుంటారనీ తెలిపారు. కొత్త మట్టి కుండలో పాలు, బెల్లం, బియ్యం వేసి పరమాన్నం చేసి, దానికి వేప ఆకులు, పసుపు, కుంకుమలతో కుండను అలంకరించి వాటిని మహిళలు నెత్తినెత్తుకొని గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, డొక్కాలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మారెమ్మ, నూకాలమ్మ, వివిధ రూపాలలో కొలువైన అమ్మవారల ఆలయాలకు వెళ్లి నైవేద్యాన్ని సమర్పించడమే బోనాల జాతరనీ ఆయన వివరించారు. అమ్మవారి జాతర వేడుకల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఎల్లప్పుడూ అందరూ ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బోనాల జాతరలో స్థానిక అధికారులు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కార్మికులు ఉత్సాహంగా పాల్గొని మైసమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.