Take a fresh look at your lifestyle.

మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు.


మంగళవారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి, సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ గోదామును అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, అవసరమైన అన్ని చట్టాలను వినియోగించి నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీలు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొనుగోలు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, అవసరమైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో స్థానిక హమాలీలను వంద శాతం వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని, ఎక్కడా కూడా హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హమాలీలు అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తే వారి లైసెన్సులను రద్దు చేయాలని, అవసరమైన పోలీసుల సహకారం తీసుకోవాలని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ధాన్యం రైస్ మిల్లులకు చేరిన తర్వాత రైతులకు రశీదులు ఇస్తుండటం వల్ల కోతలు జరుగుతున్నాయని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని ఆదేశించారు. పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి రైస్ మిల్లుకు కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం సమర్థవంతమైన అధికారిని నియమించాలని, ఆయా అధికారులు ప్రతి రోజూ నివేదికలు పంపించాలని ఆదేశించారు. కొనుగోళ్ల వ్యవహారంపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు మిషన్ మోడ్‌లో పని చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రతి రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. కొనుగోళ్ల అంశాన్ని తేలికగా తీసుకునే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ వివిధ సమస్యలపై రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి రావొద్దని, రవాణా కోసం నిబంధనల ప్రకారం వాహనాలు ఇవ్వని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.
అనంతరం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 25 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద 11 లక్షల 52 వేల టన్నుల ధాన్యం పెండింగ్‌లో ఉందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం ఇప్పటివరకు రూ. 3,873 కోట్లను బ్యాంకుల ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 కోట్ల 68 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్లు హమాలీలు, రవాణా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఫీడ్‌బ్యాక్ అందేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచులు, హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరిగేలా ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో భారీగా మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని అన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్న తెలంగాణలోకి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన బందోబస్తు, విజిలెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాల సూచనలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే ఒక నెల అత్యంత కీలకమని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగి, ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట్ర మంత్రివర్గం రూ. 4,178 కోట్లను ఆమోదించిందని తెలిపారు.
ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు జరగగా, ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ప్రైవేట్ వ్యాపారులు కూడా అధిక ధరలకు మరో 6 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
మొత్తం 14 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల నిల్వ అవసరం ఉండగా ఇప్పటికే 10 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు.
అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా సరఫరాలో కొంత అంతరాయం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు స్వయంగా గన్నీ సంచులు తీసుకువస్తే డీబీటీ ద్వారా చెల్లింపులు చేస్తున్నామని పేర్కొన్నారు.
హమాలీలు, గన్నీ సంచులు, నిల్వ సామర్థ్యం అంశాలపై కలెక్టర్లతో నిరంతర సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. హమాలీ చార్జీలను ఒక్కో సంచికి రూ. 8.50కు పెంచినట్లు చెప్పారు. అవసరమైన రవాణా వాహనాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
ఈ వీసీ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం లోడ్ లను ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకొని కాంటా వేయాలని, కాంటా వేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు ఎప్పటికప్పుడు పూర్తి చేసి,కాంటా వేసిన వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కేంద్రాల వద్ద కాని మిల్లుల వద్ద కాని హమాలీల సరిపడ లేకపోతే హమాలీల సంఖ్య పెంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు అవసరమైతే అదనంగా లారీలు పెట్టాలన్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి లారీల కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద, మిల్లుల వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనుగోలు ఆలస్యం కాకుండా వెంటనే పరిష్కరించేందుకు ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి ప్రతిరోజు నివేదికలు సమర్పించాలన్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ, జిల్లా సివిల్ సప్లై అధికారి రోజా రాణి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి మురళి, ట్రాన్స్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.