Take a fresh look at your lifestyle.

‘నందిని’కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనిమేష కవితా సంపుటికి వరించిన గౌరవం శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ అక్షర వెలుగు, ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన కవితా సంపుటి ‘అనిమేష’ లో కరోనా కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను హృద్యంగా చిత్రీకరించారు. ఈ అవార్డు తెచ్చిపెట్టిన ‘అనిమేష’ కవితా సంపుటి కేవలం అక్షరాల కూర్పు కాదు అది ఒక కాలానికి దర్పణం. ప్రపంచాన్ని వణికించిన కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలు, వలస కూలీల కష్టాలు, ఒంటరితనాన్ని ఈ సంపుటిలో కళ్లకు కట్టారు. మరోవైపు మానవ సంబంధాల విచ్ఛిన్నత, సమాజంలో ఒంటరితనం, ఆందోళన, సామాజిక కలతలను ప్రతిబింబింపజేసే నందిని సిధారెడ్డి కవిత్వం పాఠకులకు ప్రేరణగా నిలుస్తోంది.తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా, మంజీరా రచయితల సంఘం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఊపునిచ్చి, తెలంగాణ ఉద్యమానికి తన కవిత్వం ద్వారా గొప్ప సహకారం అందించి తెలంగాణ సాహిత్యానికి ఆయన గర్వకారణంగా నిలిచారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా
నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు. తన కలం ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆత్మ, జీవన విధానాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణ సాహిత్యానికి అగ్రగామిగా నిలిచారు. ఆయన రచనలు కవిత్వం మాత్రమే కాకుండా తెలంగాణ జీవితం, ప్రజల సమస్యలు, ఉద్యమం వంటి అంశాలను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. అలాగే.. మెదక్ జిల్లా కేంద్రంగా ‘మంజీరా రచయితల సంఘం’ స్థాపించి, ఎందరో వర్ధమాన కవులను, రచయితలను సిద్ధారెడ్డి ప్రోత్సహించారు. సాహిత్యానికి ప్రాంతీయతను అద్దడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఈ సంఘం ద్వారా తెలుగు సాహిత్యంలో నూతనవాణి, విభిన్న అభివ్యక్తులు, సామాజిక చైతన్యానికి వేదికైంది. ఈ సంఘం తెలుగు సాహిత్యానికి కొత్త వన్నె తెచ్చి, యువ రచయితలకు ప్రేరణనిస్తూ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన సృజనాత్మక రచనల ద్వారా చాటుతూ తెలంగాణ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చింది.

ఉద్యమ పాటల స్వరకర్త..
‘నాగేటి సాల్లల్ల నాతెలంగాణ(పోరు తెలంగాణ -2011)’ వంటి పాటల ద్వారా తెలంగాణ పల్లె జీవనాన్ని, ఆత్మగౌరవాన్ని సిద్ధారెడ్డి ప్రపంచానికి చాటిచెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ప్రజలను ఉర్రూతలూగించడమే కాకుండా, స్వరాష్ట్ర ఆకాంక్షను బలోపేతం చేశాయి. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో నందిని సిధారెడ్డి పాటలు, కవిత్వం ద్వారా ప్రజలను ఆలోచింపజేశారు. ఆయన రచనలు రాష్ట్ర ఉద్యమానికి ఉత్సాహాన్ని నింపాయి. దీంతో పాటు ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా.. ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా (జై బోలో తెలంగాణ-2011), పుడమి పండుగ పువ్వుల జాతర మగువల పండుగ మమతల జాతర(కొలిమి), ఇది చర్రిత ఇది పవిత్ర జనవిముక్తి సమరం.. సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం (బందూక్- 2015), చెలియా చెలియా విడిపోకే కలలా( 2 కంట్రీస్ -2017)లాంటి వంటి పాటలను రచించారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, భాషా సాహిత్యాల వికాసం కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌గా నందిని సిధారెడ్డి సేవలు అందించారు. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు అనేక పుస్తకాలను ఆయన వెలుగులోకి తెచ్చారు.

తెలంగాణకు గర్వకారణం : సీఎం రేవంత్ రెడ్డి
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ 2025 పురస్కారం లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి రాసిన “అనిమేష” కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. సిధారెడ్డి కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను చిత్రీకరించడంతో తనకు సమాజంపట్ల ఉన్న నిబద్ధతను, తనలోనున్న ఆర్ద్రతను తెలియజేస్తుందని, వారు గొప్ప మానవతావాదని అన్నారు. సిధారెడ్డి సుదీర్ఘ సాహిత్య కృషికి లభించిన గౌరవమని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజల్లో చైతన్యం నింపడంలో వారు పోషించిన పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్డి ఎన్నో పరిశోధనాత్మక రచనలతో సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారని, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాహితీ రంగంలో సిధారెడ్డి మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

సిద్ధారెడ్డికి సరైన గౌరవం : కేటీఆర్
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సిధారెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ పెట్టారు. తెలంగాణ కవి, రచయిత, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించిందన్నారు. కరోనా కాలంలోని పరిస్థితులపై ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించిందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఆయన కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.