మాదాపూర్, ముద్ర విలేఖరి: మా కాలనీని అక్రమ వ్యాపారుల బారి నుండి రక్షించండంటూ కొండాపూర్ లోని శ్రీరాంనగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో శ్రీరాంనగర్ కాలనీ వాసులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుండి మధ్యహ్నాం ఒంటి గంట వరకు ‘సేవ్ శ్రీరాంనగర్- శ్రీరాంనగర్ ను రక్షించండి’ జోమోటో, స్విగ్గీ వ్యాపారాల లైసెన్స్ లు రద్దు చేయాలి, కో-లివింగ్ హాస్టళ్లు ఎత్తివేయాలి, కాలనీ వీధుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలి’ అని నినాదాలు చేశారు. తొలుత కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
అనంతరం జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని కలిసి వారి ఇబ్బందులు వివరించారు. డిప్యూటీ కమిషనర్ సురేశ్ కు సైతం వినతి పత్రం సమర్పించి సుమారు రెండు గంటల పాటు కార్యాలయ ఆవరణలో తమ ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులకు సమస్యలు వివరించారు. శ్రీరాంనగర్ ఎ.బి.సి కాలనీలో జోమోటో, స్విగ్గీ కార్యాలయాలతో పాటు కో-లివింగ్ హాస్టల్స్ నిర్వహణ వల్ల కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తదితరులు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కి వివరించారు. గత ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్క అధికారి స్పందిండం లేదని కమిషనర్ ఎదుట కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులను ఆదేశించిన కమిషనర్: కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జోనల్ కమిషనర్ ఉపెందర్ రెడ్డి శ్రీరాంనగ్ కాలనీ వాసుల సమస్యలు విని కార్యాలయ సూపరిండెంట్ ఇంజనీర్, డిప్యూటీ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజల్లో శ్రీరాంనగర్ కాలనీ వాసుల సమస్యలకు పరిష్యారం చూపించాలన్నారు. పోలీస్ ప్రొటక్షన్ తో కాలనీ రోడ్ల ఆక్రమణ తొలగించాలని, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కో –లివింగ్ హాస్టళ్లను, వ్యాపార సముదాయాలను సీజ్ చేయాలన్నారు. మరో మారు కాలనీ వాసులు సమస్యలతో కార్యాలయానికి రావద్దని అధికారులకు సూచించారు.
బుధవారం రోజు ప్రత్యేక కార్యాచరణ: ఈ నెల 23వ తేది బుధవారం రోజు శ్రీరాంనగర్ కాలనీలో పోలీసు అధికారుల సహకారంతో ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని ఇన్ ఛార్జ్ డిప్యూటి కమిషనర్ సురేశ్ తనను కలిసిన శ్రీరాంనగర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ వాసుల ఇబ్బందులను యంత్రాలు, సిబ్బంది సహకారంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆదేశాలు సైతం అందాయని, తక్షణమే సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామన్నారు.
ఆందోళన ఉదృతం చేస్తాం: కాలనీ వాసులు:
మరో వారం రోజుల్లో తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి, నర్సింహ్మారావు, ప్రసాద్ తదితరులు మీడియాతో మాట్లాడుతూఈ మేరకు డిమాండ్ చేశారు. అవసరమైతే రాస్తరోకో చేయడానికి వెనకాడబోమని, జీహెచ్ఎమ్సీ కమిషనర్ ను సైతం కలుస్తామన్నారు. అధికారులు హామీలకే పరిమితం కాకుండా కార్యాచరణలో చూపాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందన్నారు. తమ కాలనీల్లో సాధారణ జనజీవనానికి తీవ్ర స్థాయిలో ఇబ్బంది జరుగుతోందని, శ్రీరాంనగర్ అంటే ఒక టూరిజం కేంద్రంగా భావిస్తున్నారని ఆవేదం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇక్కడి పరిస్థితుల ఫలితంగా పలు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.