ముద్ర పెబ్బేరు
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి వార్డు సభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరలక్ష్మి, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.గ్రామ సభలో ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన, ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు. గ్రామంలో అమలు చేసిన వివిధ ప్రభుత్వ పథకాలు వాటిని పొందిన లబ్ధిదారుల వివరాలను అధికారులు చదివి వినిపించారు. గ్రామంలో రైతు రుణమాఫీ పొందిన లబ్ధిదారులు, జరిగిన రుణమాఫీ మొత్తం, రైతు భరోసా, వరి ధాన్యం సేకరణ చెల్లించిన నగదు, మొత్తం రేషన్ కార్డులు, కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులు, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులు, ఇంకా మంజూరు చేయాల్సి ఉన్న వివరాలు, స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన వడ్డీ లేని రుణాలు, చేయూత పెన్షన్ల లబ్ధిదారులు, ఉచిత చీరల పంపిణీ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించిన పనిదినాలు, మంజూరు అయిన వేతనం, చేపట్టిన పనులు, అంచనా విలువ తదితర అంశాలను లబ్ధిదారుల
పేర్లతో సహా చదివి వినిపించారు. గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలు, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల బాధ్యతల పై గ్రామ సభలో చర్చించారు.
గ్రామ సభలు తరుచుగా నిర్వహించాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని గ్రామ సభలో ప్రజలు దరఖాస్తులు ఇచ్చారు.
ప్రభుత్వం త్వరలో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఇందిరమ్మ జీవిత భీమా కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆల్ఫాహారం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించబోతుందని, ఇందులో భాగంగా పిల్లలకు 3 రోజులు గ్లాస్ పాలు, మరో 3 రోజులు రాగి జావా అందించనున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే ఇస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఇక నుండి జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ భరత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజు, ఏఈఓ అనూష, వార్డు సభ్యులు విష్ణు, రాముడు, ఉమా, సుష్మ,కవిత, కల్పన గ్రామ ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.