Take a fresh look at your lifestyle.

జర్నలిజం వృత్తిని అపవిత్రం చేస్తే ఊరుకునేది లేదు

  • టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ

ముద్ర, తెలంగాణ బ్యూరో :- జర్నలిస్టుల పేరుతో…..ఈ వృత్తికి మచ్చ తెస్తున్న నకిలీ ముఠాలకు తగినరీతిలో బుద్ది చెప్పక తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ హెచ్చరించారు. గురువారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన గజ్వేల్ నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశం, యూనియన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల కాలంలో జర్నలిస్టుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తుల ఆగడాలు మితిమీరి పోతున్నాయన్నారు. ప్రజలను, అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి ముఠాల కదలికలపై తమ సంఘం కన్నేసి పెట్టిందన్నారు. చట్టపరంగా వారికి శిక్ష పడేలా చర్యలు చేపడుతున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు.

సుదీర్ఘ సామాజిక చరిత్ర కలిగి ఉన్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ ను స్థాపించి 25యేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రజతోత్సవాలు జరిపేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు, ఇండ్లు, ఆరోగ్య పథకం, అక్రెడిటేషన్ కార్డుల మంజూరీ తదితర సంక్షేమ చర్యల అమలు కోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేందర్, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణ, జగదీశ్, కిరణ్, మునీర్, యాదగిరి తదితరులు మాట్లాడారు

Leave A Reply

Your email address will not be published.