Take a fresh look at your lifestyle.

గ్రామీణాభివృద్ధి,స్త్రీ,శిశు సంక్షేమ శాఖతో మెరుగైన సేవలు

  • ఆ శాఖలతో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయి
  • జువైనల్ హోమ్స్ లో స్పోర్ట్స్ కిడ్స్ పంపిణీ
  • మహిళా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలి
  • స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపార శిక్షణ ఇవ్వాలి
  • దివ్యాంగుల శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
  • మండల కేంద్రాల్లోనూ ట్రాన్స్ జెండర్ ల సేవలు
  • పీఆర్​ కు రూ.వెయ్యి కోట్లు, శిశుసంక్షేమానికి రూ. 600 కోట్ల ఎక్కువ బడ్జెట్​ కేటాయించాలి
  • ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క

ముద్ర, తెలంగాణ బ్యూరో : గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. ఆయా శాఖల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందాలని వారు ఆకాంక్షించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయా శాఖల పురోగతిపై చర్చించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నతనంలోనే మంచి పోషక ఆహారాన్ని అందించడం ద్వారా వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.వారిపై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అన్నారు.జువైనల్ హోమ్స్ లోని పిల్లల మానసిక పరిపక్వతకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ఇందుకు గాను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి స్పోర్ట్స్ కిడ్స్ అందిస్తామని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు హామీ ఇచ్చిన భట్టి… స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డికి సూచించారు.

శిశు విహార్ లో ప్రస్తుతం ఉన్న శిశువుల సంఖ్య వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య సహాయం తదితర అంశాలపై మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాల పరిస్థితి పైన డిప్యూటీ సీఎం, మంత్రి సీతక్క ఆరా తీశారు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నట్టు అధికారులు తెలపడంతో వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెద్ద వ్యాపారాలకు పనికొచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. దివ్యాంగులకు స్వల్పకాలిక శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ జెండర్ ల సేవలను ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్ళలో వినియోగిస్తున్నారన్న సీతక్క.. ఈ ప్రయోగం విజయవంతమైతే మండల కేంద్రాల్లోనూ వారి సేవలు వినియోగిస్తామని చెప్పారు. దీంతో పాటు ట్రాన్స్ జెండర్ ల క్లినిక్ సెంటర్లు దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయన్నారు.

కేంద్ర సౌజన్యంతో కొనసాగుతున్న పథకాలు, నిధుల విడుదల, భవిష్యత్తులో ఈ పథకాలకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. కాగా బడ్జెట్​ సమావేశాలను పురస్కరించుకుని వచ్చే మీటింగ్​ లో పంచాయతి రాజ్​ శాఖకు గతంలో కంటే రూ. వెయ్యి కోట్లు, శిశు సంక్షేమ శాఖకు రూ. ఆరొందల కోట్లు ఎక్కువ కేటాయించాలని సీతక్క డిప్యూటీ సీఎంను కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితా రామచంద్రన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.