- చిక్కుల్లో ప్రభాకర్ రావు.
- త్వరలోనే భారత్ కు ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు.
- ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును భారత్ రప్పించే ప్రయత్నంలో ముందడుగు.
- రెడ్ కార్నర్ నోటీసులు అమలు ప్రక్రియను ప్రారంభించిన అమెరికా.
- యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు.
- జూన్ 20 లోపు విచారణకు హాజరు కాకపోతే అఫెండర్ గా ప్రకటిస్తామన్న నాంపల్లి కోర్టు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చిక్కుల్లోపడ్డారు. ఈ కేసును విచారిస్తోన్న నాంపల్లి కోర్టు జూన్ 20 లోపు విచారణకు హాజరు కాకపోతే అఫెండర్ గా ప్రకటిస్తామని ఇటీవల హెచ్చరించింది. తాజాగా అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. దీంతో ప్రభాకర్ రావు ఎప్పుడు, ఏ క్షణంలో ఇండియాకు వస్తారోననే ఆసక్తి నెలకొన్నది. ఈ ఏడాది మార్చి 10న ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. ప్రభాకర్ రావును అమెరికా నుంచి భారత్ పంపించేందుకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో తనను పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్ధి) గా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ప్రభాకర్ రావును రాజకీయ శరణార్ధిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో దర్యాప్తు బృందం (సిట్) పంపింది. రాష్ట్రంలో కీలక వ్యక్తుల వ్యక్తిగత సంభాషణల్ని అక్రమంగా ట్యాప్ చేయించడంలో ఆయన పాత్ర గురించి సిట్ అధికారులు నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలోనే యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రభాకర్ రావును భారత్‌కు డిపోర్ట్ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. మరోవైపు అతను తప్పించుకునేందుకు ఉన్న దారులను క్లోజ్ చేసేందుకు సిట్ టీమ్ బలంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.కాగా ఈ కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నిర్ణయం వెలువరిస్తూ న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ప్రభాకర్‌రావును కోర్టు ఇది వరకే ఆదేశించింది. ఒక వేళ హాజరుకాకుండా తప్పించుకుని తిరిగితే అఫెండర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించింది. జూన్ 20 లోపు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ నివాసానికి నోటీసులు అంటించారు. ప్రభాకర్‌రావు హాజరైతేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే చాన్స్ ఉంది. అయితే ఆయన స్వదేశానికి తిరిగి వస్తారా లేక మరేదైనా సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.