ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు వారము” కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. చెరువుల అభివృద్ధి, చేప పిల్లల పంపిణీ, మత్స్యకారులకు ఆధునిక పరికరాల అందజేత, స్వయం ఉపాధి అవకాశాల కల్పన వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేపల పెంపకం, మత్స్య సంపద అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు, మత్స్యకారులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధికారులు గ్రామస్థాయిలో మరింత విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారి రాజారామ్, సైంటిస్ట్ నాగరాజు, కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్టర్ వెంకట్రెడ్డి, మత్స్యకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.