ముద్ర ప్రతినిది, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తు లను ఆగస్టు నెల 14 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ కార్యాలయం సందర్శించి కలెక్టర్ భూ భారతి దరకాస్తులఫై ఆరాతీశారు. అంతకు ముందు ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో కూర్చొని విద్య బోధనలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠ్యాంశం బోధన (ఐ ఎఫ్ టి) ఇంటర్ యాక్ట్ ప్లాంట్ ప్యానల్ ద్వారా విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకు మెరుగైన విద్య బోధనలు అందించాలని, క్రమశిక్షణ నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.తర్వాత కిచెన్ వంటగది సామాగ్రి, పప్పు దినుసులు, వంట నూనె, వంటకు సంబంధించిన సరుకుల నాణ్యత పరిమాణాలతో కూరగాయలు కూడా నాణ్యతగా ఉండాలని, విద్యార్థులకు మంచి భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వన మహోత్సవం ఏర్పాట్లకై మొక్కలను నాటేందుకు పెంచుతున్న నర్సరీని పరిశీలించి, మన మహోత్సవం కొరకు చాలా రక రకాల మొక్కలను ఎక్కువగా పెంచాలని, అందులో పండ్ల తోటలు జామ, సీతాఫలం, అల్ల నేరేడు, దానిమ్మ, సపోటా, నిమ్మ, మునుగ చాలా రకాల మొక్కలను పెంచాలని అధికారులను ఆదేశించారు. నర్సరీలో దాదాపు 47 లక్షల మొక్కలకు పైగా పెంచు తున్నామని, వన మహోత్సవం కొరకు ఈ నర్సరీ నుండి దాదాపు 35 లక్షల మొక్కలను ఇస్తున్నామని, అధికారులు వన మహోత్సవం ఏర్పాట్లపై సిద్ధం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డిఆర్ డిఓ రఘువరణ్, డిఇఓ కె. రాము, ఎమ్మార్వో ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
