Take a fresh look at your lifestyle.

సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

 

అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి, పాత్‌హోల్ ఫ్రీ రహదారుల లక్ష్యం, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి రహదారి నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, ఎక్కడైనా గుంతలు కనిపిస్తే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. వర్షాలు, నేల స్వభావం, ట్రాఫిక్ తీవ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని దీర్ఘకాలికంగా ఉపయోగపడే రహదారులు నిర్మించాలన్నారు.

అదే సమయంలో ప్రజా రవాణాను చౌకగా, సౌకర్యవంతంగా అందుబాటులోకి తేవడానికి ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. తక్కువ వ్యయంతో, పర్యావరణ హితంగా ఉండే ఈవీ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు.

మెరుగైన రహదారులు, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని సీఎం అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.