- జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి.
- కలెక్టర్ ను కలిసిన డీపీఓ, యాచారం ఎంపీడీఓ.
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: మాల్ గ్రామానికి జాతీయస్థాయిలో ఆత్మ నిర్భర్ అవార్డు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.2023-24 సంవత్సరానికి సంబంధించి జాతీయ పంచాయతీ అవార్డు – ప్రత్యేక విభాగంలో భాగంగా యాచారం మండలం మాల్ గ్రామానికి ఆత్మ నిర్భర్ పంచాయతీ అవార్డు వచ్చిన సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారులు పద్మజా రాణి, సురేష్ మోహన్, యాచారం ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఎంపీఓ శ్రీలత, మాల్ పంచాయతీ కార్యదర్శి రాజు లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ లను శనివారం కొంగర కలాన్ జిల్లా కలెక్టరేట్ లో కలిశారు.ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మాల్ గ్రామపంచాయతీ ప్రభుత్వ వనరులపై ఆధారపడకుండా సొంతంగా ఆదాయ వనరులను సమకూర్చుకోవడం శుభపరిణామం అన్నారు. గ్రామాలన్నీ ఇదేవిధంగా సొంత ఆదాయ వనరులను సమకూర్చుకుంటే శరవేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు.మాల్ గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న అధికారులను అభినందించారు.ఆత్మ నిర్భర్ అవార్డు క్రింద మాల్ గ్రామపంచాయతీకి రూ. కోటి కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్నదని చెప్పారు.దీంతో పంచాయతీ మరింత అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు.