Take a fresh look at your lifestyle.

బస్వాపురం ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఇండ్ల నష్టపరిహారం వెంటనే అందించాలి: భూ నిర్వాసితుల కమిటీ కన్వీనర్ వల్దాస్ రాజ్ కాళభైరవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బియన్ తిమ్మాపురం గ్రామస్తులకు ఇండ్ల నష్టపరిహారం వెంటనే అందించాలని భూ నిర్వాసితుల కమిటీ కన్వీనర్ వల్దాస్ రాజ్ కాళభైరవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బియన్ తిమ్మాపురం గ్రామంలో నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో భూములు 1750 ఎకరాలు పూర్తిగా బస్వాపురం ప్రాజెక్టు లో ముంపునకు గురౌతున్నాయని అన్నారు. భూనిర్వాసితులకు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నష్టపరిహారం విషయంలో గ్రామ పునర్వాసం సంబందించి అన్ని విధాలుగా అన్యాయం చేసిందన్నారు. లక్షలు ఖరీదు చేసే భూములు కేవలం ఎకరానికి 15 లక్షలు ఇచ్చి అన్యాయం చేసిందన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నేను గెలిచిన నెల రోజులలో మీ గ్రామ సమస్యలన్ని పరిష్కారం చేస్తానని చెప్పి గెలిచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా గ్రామ పరిస్తితి ఏక్కడ వేసిన గొంగడి అక్కడె ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షళన భువనగిరి మీటింగ్ కీ వచ్చిన్నప్పుడు ఆయన ముందు ఇండ్ల నష్టపరిహారం 50 కోట్లు వచ్చాయని చెప్పి ఆ డబ్బులు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఆ ముంపు బాధితుల ఖాతాలలో ఇంకా వెయ్యలేదన్నారు. ప్రభుత్వం మాటల ప్రభుత్వమేకాని చేతల ప్రభుత్వం కాదనడానికి ఇదొక నిదర్శనమన్నారు. గ్రామంలో ఇండ్లు కూలిపోయే స్థితికి వచ్చినాయన్నారు. ప్రాజెక్టులో నీరు వచ్చి క్రిమి కీటకాలు గ్రామం లోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏలాంటి హాని కల్గిన పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నష్టపరిహారం విషయంలో కాలయాపన చేస్తు ముంపు గ్రామస్థులకు అన్యాయం చేస్తుందన్నారు.

నూతన గ్రామాన్ని హుస్సేన్ బాద్ 107 సర్వే నంబర్ లో చేశారని గుట్టలమయంగా ఉండి ఇండ్లు కట్టుకోలేని స్థలంగా ఉందన్నారు. గ్రామానికి అప్పుడు ఎంపీ గా ఉన్న ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాజెక్టు కట్టమీద ధర్నా చేస్తున్న సమయంలో వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తా అన్నారని చెప్పారు.
గ్రామస్థులు భూములు కోల్పోయి, ఇండ్లు కోల్పొయి, జీవనోపాధి కోల్పోయి అన్ని విధాలుగా నష్టపొయి ఉన్నారని ప్రభుత్వాలు మారినా ఇక్కడ జీవితాలు మారుతలేవన్నారు. నష్టపరిహారం తొందరగా ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూ నిర్వాసితులందరితో కలిసి, భవిష్యత్తు కార్యాచరణ లు, కలెక్టరేట్ లు ముట్టడిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ సభ్యులు పిన్నం నారయణ, ఉడుత వీరాస్వామి, మణికంఠ, బిచ్చాల మహేష్, నవీన్, బాలు, పిన్నం గనేష్, పాండు ,లక్ష్మి, అనసూయ, పద్మ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.