Take a fresh look at your lifestyle.

పోలీస్ కుటుంబాల సంక్షేమమే సొసైటీ లక్ష్యం : సీపీ డాక్టర్ ఎం.రమేశ్ రెడ్డి

 

ముద్ర, శేరిలింగంపల్లి :

సైబరాబాద్ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మూడవ సర్వసభ్య సమావేశం ఈరోజు కమిషనరేట్ ఆడిటోరియం లో సైబరాబాద్ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్ సైబరాబాద్ సీపీ డా. ఎమ్.రమేష్, అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశంలో సెక్రటరీ ఎస్ బీ ఏడీసీపీ ఎస్. రవికుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ ఇట్టి సొసైటీ 1951వ సంవత్సరం లో హైదరాబాద్ రూరల్ జిల్లా నందు ఏర్పాటు చేసారని, 10 రూపాయలతో మొదలుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ కు చేరినది అని తెలిపారు.

ఉపాధ్యక్షులు అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సొసైటీ కార్యకలాపాలు మరియు సభ్యుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను వివరించారు. ఈ కాలంలో 681 మంది సభ్యులకు 8.5 శాతం వడ్డీతో రూ. 43,09,25,000 రుణాలను అందించామని తెలిపారు. అలాగే చనిపోయిన ఆరుగురు సభ్యుల కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల కోసం ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని, 93 మంది సభ్యులకు చెందిన 105 మంది పిల్లలకు రూ. 9.65 లక్షల స్కాలర్‌షిప్‌లు ఇచ్చామని పేర్కొన్నారు. వీటితో పాటు మరణించిన నలుగురు సభ్యులకు సంబంధించిన రూ. 9,87,864 రుణాన్ని పూర్తిగా మాఫీ చేసినట్లు ఆమె వెల్లడించారు.

సిపిసిసిఎస్ అధ్యక్షులు, సైబరాబాద్ సీపీ డా. ఎమ్.రమేష్ మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమానికి పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సిపిసిసిఎస్ పనితీరును ప్రశంసిస్తూ, రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈ సంస్థ అత్యంత పారదర్శకంగా, దిగ్విజయంగా నడుస్తోందని కొనియాడారు. సభ్యుల పొదుపు మరియు ఆర్థిక భద్రత విషయంలో సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు.
సొసైటీకి వచ్చిన ఇన్కమ్ టాక్స్ నోటీసుల విషయంలో ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటామని, ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో కోశాధికారి జి. మల్లేష్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ 13 శాతం డివిడెండ్ ప్రకటించి తీర్మానాలను ప్రవేశపెట్టగా, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుండి టి. రమాదేవి హాజరై సంస్థ కార్యకలాపాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో కుత్భుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, ఐపీఎస్., అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, ఐపీఎస్., కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కర్ణం, సైబరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ట్రాఫిక్ డీసీపీ -1 రంజన్ రతన్ కుమార్ మరియు వివిధ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.