- ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలి.
- డైరెక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం, ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చాలి.
- విద్యుత్ ఒప్పందాల అమలుపై రోజువారి సమీక్షలు చేయండి.
- జెన్ కో అధికారులు, డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఐదు, పదేండ్లలో రాష్ట్రంలో ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్ కు అనుగూణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లను ఆదేశించారు. 2023లో మార్చిలో వచ్చిన 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్, 2025 మార్చిలో వచ్చిన 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2029-30 నాటికి ఎంత మేరకు డిమాండ్ పెరుగుతుంది, అదే పద్ధతిలో 2030-35, 2047 ఏండ్లకు ఏర్పడే విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లతో భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, మూసి పునర్జీవనం, పెరుగుతున్న పరిశ్రమలు, వ్యవసాయ వినియోగం, మారిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగనున్న విద్యుత్ వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు.ఇందుకు గాను ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్ సంస్థలకు ఏడాదికి రూ. 12,500 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. నిరుపేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వీటి విలువ రూ. 2 వేల కోట్ల వరకు ఉందనీ అది భవిష్యత్తులో పెరిగి రూ.3 వేల కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అబిప్రాయపడ్డారు. మొత్తంగా ఉచిత విద్యుత్ పథకాలకు భవిష్యత్తులో రూ. 17 వేల కోట్ల వరకు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని వివరించారు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు చేసుకుని కార్యాచరణ మొదలుపెట్టాలన్నారు. తమ ప్రభుత్వం గిరిజనులు తలెత్తుకొని బతికేలా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకు వచ్చిందన్నారు.ఈ పథకం ద్వారా 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురాబోతున్నట్లు వివరించారు. మొత్తం సోలార్ పంపు సెట్లు వినియోగిస్తున్నట్టు తెలిపారు.
- రామగుండం,కేటీపీఎస్ స్థానాల్లో కొత్తవి.
2030-31, 2035 నాటికి థర్మల్ విద్యుత్తు కు ఉండే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని 50 ఏండ్ల క్రితం నిర్మించిన రామగుండం,కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ల స్థానంలో కొత్త నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసి 50 ఏండ్లు పూర్తి కావడంతో 2019లోనే మూసి వేశామని చెప్పారు. అక్కడ ఐదొందల ఎకరాల స్థలం, బొగ్గు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అక్కడ అవకాశం ఉందని ఆయన అధికారులకు సూచించారు. 62.5 మెగావాట్ల సామర్థ్యంతో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాలం చెల్లిపోవడంతో మూసి వేసినట్లు వివరించారు. అక్కడే 800 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దానికనుగూణంగా డైరెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని రావాలని చెప్పారు. అందరి దృష్టి ప్రస్తుతం తెలంగాణ రెడ్ కో పైనే ఉందన్న భట్టి.. అది దేశానికి రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా పనిచేసేందుకు రెడ్కోకు కావలసిన సిబ్బంది, ఏ స్థాయి సిబ్బంది కావాలో సవివరంగా ఓ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రెడ్ కో కు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. డైరెక్టర్లందరికీ కావలసినంత స్వేచ్ఛను ఇస్తున్నామన్నారు. దానికి తగ్గట్టు ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలను పూర్తి చేసి, విద్యుత్ శాఖ అభివృద్ధికి కావాల్సిన ఆలోచనలు చేయాలని డిప్యూటీ సీఎం కొత్తగా నియామకమైన డైరెక్టర్లను కోరారు. దావోస్ లో, హైదరాబాద్ లో, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలపై రోజువారి సమీక్ష చేయాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాలపై సోలార్ పవర్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు ఆదాయంతో పాటు, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి నీటిపారుదల శాఖ, జెన్కో రెండు శాఖలను సమన్వయం చేసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, జెన్కో సి.ఎం.డి హరీష్, రెడ్కో అధికారిని అనిలా పాల్గొన్నారు.