Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రైలు

రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు
సర్వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తొలుత 11 కిలోమీటర్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేసేందుకు కావాల్సిన సర్వే చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ రింగ్ రైలును ఓఆర్ఆర్‌కు సమాంతరంగా ఉండేలా చూడాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అన్ని అనుమతులు పూర్తైన తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులతోపాటు సరుకు రవాణాకు కూడా మేలు జరగనుంది.
తెలంగాణకు అతి ముఖ్యమైన హైదరాబాద్ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసేందుకు చేపట్టాల్సిన సర్వేను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లేఖ రాశారు. అయితే ఈ రీజినల్ రింగ్ రైలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం విశేషం.

రీజినల్ రింగ్ రోడ్డుకు సుమారు 10 కిలోమీటర్ల నుంచి 11 కిలోమీటర్ల దూరంలో గతంలో రీజినల్ రింగ్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే దీనివల్ల రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు రెండు మార్గాలు వేర్వేరుగా ఉండటం వల్ల.. ఈ రెండు ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టడం తలకు మించిన భారంగా మారుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఇలా వేరుగా చేపట్టడం వల్ల పరిపాలనపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ముందే పసిగట్టారు. ఈ నేపథ్యంలోనే రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరం రీజినల్ రింగ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం ఏర్పాటు కానున్న రీజినల్ రింగ్ రోడ్డు వెంటే రైల్వే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది.
అయితే ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు అమలుకు సంబంధించి కచ్చితమైన కాలపరిమితిని ఇప్పుడే చెప్పలేమని కేంద్రమంత్రి రవనీత్ సింగ్ వెల్లడించారు. కానీ డీపీఆర్ రెడీ చేసేందుకు కావాల్సిన ప్రాథమిక సర్వేకు ఆమోదం తెలపడం వల్ల ఈ ప్రాజెక్టులో కీలక అడుగు పడినట్లయింది. సర్వే పూర్తి చేసి పూర్తిస్థాయి రిపోర్టు రెడీ అయిన తర్వాత దాన్ని నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక శాఖల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. అన్ని శాఖల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఈ మెగా ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.
ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనివల్ల హైదరాబాద్ నగరం చుట్టూ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా.. నగర శివారు ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో కేంద్రమంత్రులను వ్యక్తిగతంగా కలిసిన సమయంలో.. ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను రేవంత్ రెడ్డి వారికి వివరించారు. పక్కపక్కనే రైలు, రోడ్డు మార్గాలు ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా భూసేకరణకు కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు పూర్తి అయి.. అందుబాటులోకి వస్తే హైదరాబాద్ పొరుగున ఉన్న జిల్లాలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా సరకు రవాణాకు కూడా ఎంతో మేలు చేయనుంది. సమన్వయంతో రింగ్ రోడ్డు, రింగ్ రైలు ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. డీపీఆర్ సర్వేకు కేంద్రం ఆమోదం తెలపడంతో ప్రాజెక్టు పనులు వేగవంతం కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.