- పెండింగ్ ఎన్నికలపై సర్కార్ ఫోకస్.
- గ్రామీణ పాలన వ్యవస్ధ బలోపేతానికి కసరత్తు.
- ఆందోళన కలిగిస్తోన్న పెండింగ్ బిల్లుల వ్యవహారం.
- పల్లెలకు కేంద్ర నిధుల జాప్యంపై సీఎం ఆరా.
- కాంగ్రెస్ బీసీ నేతలతో భేటీ.
- ఎన్నికల్లో బీసీల టిక్కెట్లపై చర్చ.
- కేంద్ర కులగణనతో తెలంగాణకు సంబంధం లేదని వ్యాఖ్య.
ముద్ర, తెలంగాణ బ్యూరో : స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది.గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను ఈ ఏడాది జూలైలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కుల గణన కారణంగా ఎన్నికలు వాయిదా పడినప్పటికీ, నిధుల కొరతతో ప్రభుత్వం నష్టపోతున్నందున ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రెండు నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినప్పటికీ, కుల గణన, బీసీ రిజర్వేషన్ పెంపు ప్రక్రియతో స్థానిక ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ నియామకాల్లో విడివిడిగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపింది.మరోవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది చివరిలో జనగణన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ జనాభా సర్వే పూర్తి కావడానికి కనీసం రెండేళ్లకు పైగా సమయం పడుతుంది.పంచాయతీల పదవీ కాలం గతేడాది జనవరి 31న, జిల్లా, మండల పరిషత్‌ల గడువు గతేడాది జులైలో ముగిసింది.స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది.దీంతో ఎన్నికలు ఇంకా ఆలస్యం అయితే ఏటా రూ.1,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం భావిస్తున్నది.ఈ క్రమంలో రాష్ట్రంలో పెండింగ్ లో పడ్డ స్ధానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసి.. గ్రామీణ పాలన వ్యవస్ధను బలోపేతం చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది.ఈ క్రమంలో ఇటీవల పార్టీకి చెందిన బీసీ నాయకులతో సీఎం సమావేశమయ్యారు.పాలక మండళ్లు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోందని వివరించారు. పంచాయతీలకు నిధులు, సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు.కుల గణన పూర్తయ్యే వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా వేచి ఉండలేమన్న సీఎం అభిప్రాయంతో చాలా మంది నాయకులు ఏకీభవించారు.అదే సమయంలో కేంద్ర కులగణనతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని సీఎం బీసీ నేతలకు వివరించారు.ఈ క్రమంలో తాము ఎన్నికలకు వెళ్లవచ్చని తెలిపారు. ఈ భేటీలో పాల్గొన్న బీసీ నాయకులు అవసరమైతే ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అంగీకరించారు. కానీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం టిక్కెట్ల హామీ ఇవ్వాలని సూచించారు. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నిక సంఘం పోలింగ్ కేంద్రాలను గుర్తించి, చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో బ్యాలెట్ పత్రాలను ముద్రించడం వంటి ముందస్తు ఎన్నికల కసరత్తులను ఇప్పటికే పూర్తి చేసింది.ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించాలని జిల్లా ఎన్నికల అధికారులను కూడా కోరింది.ఇదీలావుంటే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచీ వ్యవహరిస్తోంది.తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసింది.అందులో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు గత ఏడాది కాలంగా చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది.బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామనీ హెచ్చరించింది. దీంతో బిల్లుల రూపంలో మాజీ సర్పంచులకు ఇవ్వాల్సిన రూ. 12వందల కోట్ల బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.