Take a fresh look at your lifestyle.

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి పథకాల అమలులో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలి:అడిషనల్ కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి
ప్రభుత్వం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల స్వయం ఉపాధి పథకాల కింద జిల్లాకు కేటాయించిన యూనిట్లకు బ్యాంకులు వేగంగా రుణాలు మంజూరు చేసి లబ్ధిదారులకు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ పాండు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులముల కార్యాచరణ ప్రణాళిక 2025–26 కింద సంగారెడ్డి జిల్లాకు మంజూరైన స్వయం ఉపాధి యూనిట్లకు రుణాల మంజూరుపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ పాండు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎల్‌డీఎం,నర్సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, నాబార్డ్ ఏజీఎం క్రిష్ణ తేజ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్‌తో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాల కింద జిల్లాకు కేటాయించిన వివిధ యూనిట్లకు బ్యాంకులు సమయానికి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీతో ఈపథకాలను అమలు చేస్తున్నందున బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారని, అనంతరం స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ ద్వారా అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకులు త్వరితగతిన కాన్సెంట్ ఇచ్చి రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
అదేవిధంగా పథకాల అమలులో ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధికి ఈ పథకాలు ఎంతో దోహదపడతాయని, అందరూ సమన్వయంతో పనిచేసి పథకాలను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, రుణ సదుపాయాలతో లబ్ధిదారులు స్వయం ఉపాధి ఏర్పరుచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా బ్యాంకులు సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.