ముద్ర సంగారెడ్డి, :–
కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సి ఎస్ ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు అందజేసిన రెండు బస్సులను గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు.

అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల మరియు జోగిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్‌లకు ఆ బస్సులను కంపెనీ డైరెక్టర్ మారుమోటో చేతుల మీదుగా మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నర్సింగ్ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అందజేసిన
ఈ బస్సుల ద్వారా వారికి ఎంతో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇటువంటి సహకారం అందించడం ద్వారా సంస్థ సమాజం పట్ల తన బాధ్యతను చాటుకుందని ఆయన అభినందించారు.
అదేవిధంగా బిడెకన్నె మహిళా సంఘం సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తోషిభా సంస్థ సి ఎస్ ఆర్ నిధుల ద్వారా అందజేసిన మినీ వ్యాన్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా మహిళా సంఘం ఉత్పత్తుల విక్రయాలు పెరగడమే కాకుండా, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సంగారెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుశీల, వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, జోగిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు, బిడెకన్నె మహిళా సంఘం సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.