Take a fresh look at your lifestyle.

నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: మంత్రి దామోదర్ రాజ నర్సింహ

ముద్ర సంగారెడ్డి,మార్చి :
నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్,మున్సిపల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
గురువారం సంగారెడ్డి జిల్లా కంది ఎల్.ఎన్.కన్వెన్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య నేతృత్వంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్లు,గ్రామ సర్పంచులు,కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమ అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈసందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రతి ప్రజాప్రతినిధికి తన గ్రామం, పట్టణం అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంటుందని, అందుకోసం పంచాయతీరాజ్, మున్సిపల్,అటవీ శాఖ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ఐదు దశలు,పది అంశాలుగా రూపొందించిందని తెలిపారు.మార్చి 6నుండి జూన్ 12 వరకు నిర్వహించే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ మంత్రి దామోదర్ పిలుపునిచ్చారు.వచ్చే నెల ఏప్రిల్ 2 నుంచి గ్రామాల్లో గ్రామసభలు,పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా గ్రామసభలకు హాజరై ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని సూచించారు.


గ్రామాలు,పట్టణాల అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి అంకితభావంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసం పొందుతారని సూచించారు. పని తీరుతోనే ప్రజల్లో గుర్తింపు వస్తుందని,సేవాభావంతో పనిచేసే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో మహిళలే అధికంగా ఉన్నారని తెలిపారు.మహిళా శక్తి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీరు,డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే నిధులు ఎలా సమకూర్చుకోవాలి,గ్రామాల్లో రెవెన్యూ,అటవీ భూములను రక్షించుకోవడం, పంచాయతీరాజ్ చట్టాలను సర్పంచులు తెలుసుకోవడం చాలా ముఖ్యమని వెల్లడించారు.నేర్చుకుంటూ ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక భాగంగా ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు,వైద్య పరీక్షలు,గర్భిణీలు చిన్నారులకు ప్రత్యేక పర్యవేక్షణ,పోషకాహార అవగాహన కార్యక్రమాలు, పోలీస్,రవాణా శాఖల ద్వారా రహదారి భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాలఅమలు, సంక్షేమ పథకాల అమలులో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడం, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం,హాస్టళ్ల పరిశుభ్రతపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. రైతులకు పంటలపై మార్గదర్శకాలు, బీమా పథకాల అవగాహన, ఎరువులు–విత్తనాల లభ్యత, విద్యా రంగంలో పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అలాగే యువత,క్రీడల అభివృద్ధికి క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి,స్వయం సహాయక సంఘాల బలోపేతం,బాల్య వివాహాల నివారణ,మహిళల భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం,మొక్కల సంరక్షణ, వనమహోత్సవం ఏర్పాట్లు, పర్యావరణ అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.


ఈసందర్భముగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు చట్టాలు, విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతారని తెలిపారు.గ్రామసభలద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి తగిన ప్రణాళికలు రూపొందిస్తే గ్రామాలు,పట్టణాలు అభివృద్ధి పథంలో ముందంజలో ఉంటాయని తెలిపారు.
టి.జి.ఐ.ఐ.సీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజల కోసమేనని, ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని అన్నారు.జహీరాబాద్ నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ ఐదు సంవత్సరాల పాలనలో గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు.పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణకు కృషి చేయాలని, మున్సిపాలిటీలలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యాచరణను వివరించారు.
ఈకార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిమ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు,జడ్పీ సీఈఓ జానకిరెడ్డి,సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు,గ్రామ సర్పంచులు,కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.