Take a fresh look at your lifestyle.

Parliament Budget Session 2025: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతోపాటు మొత్తం 16 ముఖ్యమైన బిల్లులను
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.ఈ పార్లమెంట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. తొలిరోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.

ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. కాగా, ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్‌ సవరణ బిల్లు కూడా ఉంది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలకు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.