ముద్ర, బాన్సువాడ: బాన్సువాడ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే తన లక్ష్యమని, అందుకే ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలో 1998 వ సంవత్సరంలో స్థాపించబడిన SRNK డిగ్రీ కళాశాల 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కళాశాల కమిటీ నిర్ణయించిందని అన్నారు.ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించడానికి కళాశాల కమిటీ సభ్యులతో బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కళాశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్ల పై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు.కళాశాల అభివృద్ధికి తోడ్పడిన విశిష్ట అతిథులను, పూర్వ విద్యార్థులను ఈ వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించారు.కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులతో పాటు, వివిధ రంగాలలో పనిచేస్తున్న వారిని ఈ వేడుకలకు ఆహ్వానించేందుకు కమిటీ సభ్యులు నిర్ణయించారు.రజతోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసి, బాధ్యతలను అప్పగించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.