Take a fresh look at your lifestyle.

బనకచర్ల పై నేడు అఖిలపక్షం

  • తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న బనకచర్ల వివాదం​.
  • ఏపీ అక్రమ ప్రాజెక్టుపై భగ్గుమంటున్న తెలంగాణ.
  • ఆరునూరైనా ముందుకెళ్తామన్న ఏపీ నీటిపారుదల మంత్రి నిమ్మల.
  • నేడు అఖిలపక్షానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ పవర్​ ప్రజెంటేషన్.
  • కేంద్రమంత్రులు, ఆల్ పార్టీస్ ఎంపీలకు ఆహ్వానం.
  • ఎంపీల అభిప్రాయాలు, సూచనలతో ముందుకు వెళ్లాలని నిర్ణయం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : బనకచర్ల ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టంది. ఏపీలో సీఎం చంద్రబాబు నాయకుడు అతిపెద్ద బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించి.. గోదావరి నీటిని సీమకు తరిలించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాని కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఫండింగ్ ఎలా రాబట్టాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. మరోవైపు గోదావరినదిపై బనకచర్లను నిర్మించి ఆ నీటిని సీమకు తరలించుకుపోయేందుకు ఏపీ చేస్తోన్న కుట్రకు తెలంగాణ సర్కార్​ చెక్​ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకువెళ్తున్నది. తెలంగాణకు నష్టం చేకూర్చే ఆ ప్రాజెక్టుకు అనుమతి నిరాకరించడంతో పాటు తిరస్కరించాలంటూ ఇప్పటికే జీఆర్​ఎంబీ, సీడబ్ల్యూసీతో పాటు కేంద్ర పర్యావరణ నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ)కి లేఖల్లో విన్నవించింది. దాంతో పాటు నేడు అఖిలపక్షంతో భేటీకి సిద్ధమైంది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ఆహ్వానిస్తూ అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు పంపారు. బనకచర్ల ప్రతిపాదనకు తమ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని.. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రానికి పలుసార్లు చెప్పామని ఉత్తమ్ తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బంకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించిందన్నారు. ఈ ప్రతిపాదనలను భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖలు ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిందని చెప్పారు. ప్రాథమిక అధ్యయనంలో, ఈ ప్రాజెక్ట్ 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు ,ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లు కనిపిస్తోందన్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ నీటి హక్కుకు భంగం కలిగిస్తుందని ఉత్తమ్​ ఆ లేఖలో పేర్కొన్నారు. గోదావరి బంకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ… ఈ ఏడాది జనవరి 22న కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులకు తాను లేఖ రాశానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గోదావరి-బంకచర్ల అనుసంధాన పథకం డీపీఆర్​ కేంద్రానికి అందలేదని, అయితే దానిని “ప్రస్తుత మార్గదర్శకాలు, ప్రస్తుత ట్రిబ్యునల్ అవార్డులు/అంతర్ రాష్ట్ర ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యావస్థీకరణ చట్టం ఏపీఆర్​ఏ, 2014 కింద వివిధ నిబంధనల ప్రకారం పరిశీలిస్తుందని హామీ ఇస్తూ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్​ పాటిల్ గత నెల 28న తనకు సమాధానం ఇచ్చారని చెప్పారు.

  • ఈఏసీ కీలక భేటీ.

బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర పర్యావరణ నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) మంగళవారం భేటీ అయ్యింది. ప్రొఫెసర్ చక్రపాణి నేతృత్వంలో ఏర్పాటయిన ఈ కమిటీ.. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులపై చర్చించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కమిటీ సమావేశమైంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించింది.బనకచర్ల ప్రాజెక్ట్ తో కలిగే పర్యావరణ ప్రభావాన్ని కమిటీ అంచనా వేసింది. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, సీఆర్‌ పాటిల్‌కు అనేక సార్లు వినతి చేశారు కూడా.ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి అడుగుపడింది. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఈఏసీ కీలక సమావేశం ప్రారంభమైంది. ప్రాజెక్ట్ నిర్మాణంతో పర్యావరణంపై ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై కమిటీ అంచనా వేసింది. త్వరలోనే ఈ కమిటీ కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్రం అనుమతులు వచ్చే అవకాశం ఉంది. కాగా ఏపీ ప్రభుత్వం ఈ సమావేశాన్ని సీరియస్‌గా తీసుకుంది. అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌ను పూర్తిగా అనుమతించొద్దని డిమాండ్ చేస్తున్న తెలంగాణ దాన్ని వ్యతిరేకించాలని పట్టుబడుతున్నది.ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఈఏసీకి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలిపారు. గోదావరి నీటిని కృష్ణలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీని వల్ల తెలంగాణ హక్కులను హరించినట్లు అవుతుందని..ఈ ప్రాజెక్ట్‌కు ఏమాత్రం అనుమతులు ఇవ్వొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

  • సీఎం రేవంత్​ ఆధ్వర్యంలో పవర్​ ప్రజెంటేషన్​

నేడు సచివాలయంలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో జరిగే ఎంపీల సమావేశానికి సీఎంరేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. గౌరవ అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరుకానున్నారు.ఈ మేరకు మంత్రి ఉత్తమ్​.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులందరికీ ఆహ్వానం పంపారు. ఏపీ ప్రతిపాదించిన ప్రాజెక్టుపై తాము ఇప్పటికే అభ్యంతరాలను తెలిపామని దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైనే రేపు జరిగే సమావేశంలో చర్చిద్దాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించారు.

  • పార్లమెంట్ లో వ్యతిరేకించే వ్యూహం.

బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణలో అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై అఖిల పక్ష సమావేశం పెట్టమని హరీష్‌రావ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై అఖిలపక్ష సమావేశం పెట్టకుండా అన్ని పార్టీల ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎంపీలు లేనందున ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలకు ఆహ్వానం పంపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీల ఎంపీలకు ఆంధ్ర చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పే వ్యూహంతో సర్కార్​ ముందుకు వెళ్తున్నది.ఈ క్రమంలో పార్లమెంట్ వేదికగా తెలంగాణ తమ గళాన్ని వినిపించాలని భావిస్తోంది.

  • తెలంగాణకు నష్టం లేదు- ఏపీ.

పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుల వల్ల ఎగువ రాష్ట్రాలకులాంటి నష్టం లేదని సముద్రంలోకి వృథాగా వెళుతున్న ౩౦౦౦ TMC ల నీటిని వాడుకోవడానికే ఈ ప్రాజెక్టులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. “పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాం-వృథాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచర్లకు తరలిస్తాం – ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నాం” అని ఏపీ నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. తెలంగాణమ చాలా ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచిన పరిస్థితిని తాము చూశామని కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతి లేకుండానే మీరు పనులు చేపట్టలేదా-? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు తమ ఎగువున కట్టినా తాము సహకరించామన్నారు.“తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం మాకు ఎప్పుడూ లేదు-తెలంగాణలో ఎన్నోప్రాజెక్టులకు  సీఎం చంద్రబాబు సహకరించారు ” అని రామానాయుడు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.