ముద్ర, తెలంగాణ బ్యూరో : సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటన కేసులో సీనియర్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ఊరట కల్పించింది. షరతులతో ఆయనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజారు చేసిన కోర్టు వాటిలో సడలింపు ఇచ్చింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు చిక్కడపల్లి పోలీసుల ఎదుట అల్లు అర్జున్ హాజరుకావల్సివుంది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ కి కోర్టు మినహాయింపు ఇచ్చింది.
అల్లు అర్జున్ గత ఆదివారం నాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి సంతకం చేసినప్పుడు ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా అక్కడకి వెళ్ళారు. దీంతో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం వలన భద్రతా పరంగా ఇబ్బందిగా ఉందని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను విచారించిన కోర్టు అల్లు అర్జున్ కు ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళనవసరం లేదంటూ కోర్టు ఆదేశించింది.