ముద్ర ,ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై – హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టు 198 కిలోమీటర్ల నిర్మాణానికి రూ. 9889 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
మౌలిక సదుపాయాలు అద్భుతం
గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన భారీ రైల్వే వంతెనను నిర్మించనున్నారు. 2.67 కిలోమీటర్ల వయాడక్ట్, 3 ప్రధాన బైపాస్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త అలైన్‌మెంట్ వల్ల ప్రస్తుత మార్గం కంటే దూరం సుమారు 8 కిలోమీటర్లు తగ్గుతుంది, ఇది ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది.
ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు
ఈ ప్రాజెక్టు కేవలం రైల్వేలైన్ మాత్రమే కాదని, ఇది ఒక ఉపాధి కల్పన పొదుపు మార్గం కూడా కేంద్ర రైల్వేశాఖ అభిప్రాయపడింది. ఈ నిర్మాణ పనుల ద్వారా సుమారు 135 లక్షల మానవ-రోజుల పని లభిస్తుందని అంచనా. రోడ్డు రవాణాతో పోలిస్తే ఏటా సుమారు రూ. 1,150.56 కోట్ల వరకు ఆదా అవుతుంది. డీజిల్ వినియోగం తగ్గడం వల్ల కాలుష్య ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో సామర్థ్యం 130 శాతానికి చేరుకోవడంతో రైళ్ల ఆలస్యం సాధారణమైపోయాయి. ఈ మూడు, నాలుగో లైన్ల నిర్మాణం పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైళ్ల వేగం పెరగడమే కాకుండా, పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి చెందనుంది.