Take a fresh look at your lifestyle.

చిన్న జిల్లాలైనా సమస్యలకు పరిష్కారం లేదు – ఈటల రాజేందర్

 

ముద్ర, హైదరాబాద్ :

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాలోని పలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈరోజు సమావేశం 49 నిమిషాలపాటు జరిగిందని, ముఖ్యమైన అంశాలపైనే చర్చించినట్లు ఎంపీ పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానికంగా నివసిస్తున్న పేదలకే కేటాయించాలని సూచించినట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం జిల్లాలో సరిగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ పథకాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో పలు ప్రాంతాల్లో కరెంటు వైర్లు లూజ్‌గా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ శాఖ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అంచనాలు సిద్ధం చేయాలని కోరినట్లు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం పలు రకాల రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, బ్యాంకర్ల నియమ నిబంధనల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఇండస్ట్రీస్, షాపులు, విద్య రుణాలను ప్రాధాన్యతగా మంజూరు చేయాలని, గ్యారంటీల పేరుతో ప్రజలను వేధించొద్దని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని భావించామని, కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే జవహర్‌నగర్, బాలాజీనగర్ డంప్‌యార్డ్ సమస్యపై ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసినట్లు వెల్లడించారు. త్వరలో స్థానికంగా జేఏసీ సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.