Take a fresh look at your lifestyle.

కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ విధానం

  • కలెక్టర్ అభిలాష అభినవ్.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ వ్యవస్థ తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వీటివల్ల డబ్బు, సమయం వృధా కాకుండా కాపాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీ వాణితో కలిసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కేసులు సంవత్సరాలుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. లోక్ అదాలత్‌ ద్వారా ఇరు వర్గాలు రాజీకి వచ్చి త్వరితంగా న్యాయం పొందవచ్చని తెలిపారు. కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చన్నారు. ఇటీవల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలు, నైతిక విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార శాఖ కళాజాత బృందాల ద్వారా గ్రామాలలో విస్తృత ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పలు క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఆస్తి గొడవలు వంటి కేసులను లోక్ అదాలత్‌ ద్వారా రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులు ప్రజలను లోక్ అదాలత్‌కు ప్రోత్సహించాలన్నారు. అనంతరం లోక్ అదాలత్‌ ద్వారా తమ విడాకుల కేసును పరిష్కరించుకున్న భార్యాభర్తలను కలెక్టర్, న్యాయమూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, డిఎల్ఎస్ఎ సెక్రటరీ రాధిక, అడిషనల్ ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నరేందర్, కోర్టు అధికారులు, న్యాయవాదులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.