ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రెండేళ్ల క్రితం లారీలో బాస్మతి రైస్ లోడ్ నింపుకొని బెంగళూరుకు తీసుకెళ్తూ మార్గమధ్యలో ఇతరులకు విక్రయించిన లారీ డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటన లో తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2023లో హర్షద్ అలీ అనే వ్యక్తి (లారీ డ్రైవర్) ఢిల్లీ నుండి బెంగళూరుకు బాస్మతి రైస్ ను లారీలో తీసుకవేళ్తూ, మార్గమధ్యలో ఆ రైస్‌ను సుమారు రూ. 3.5 లక్షల విలువకు విక్రయించి, ఖాళీ లారీని దేవునిపల్లి పీఎస్ పరిధిలోని పొందుర్తి వద్ద వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ ఘటనపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు గత రెండు సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఏఎస్‌ఐ నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రవికుమార్, పోలీస్ కానిస్టేబుల్ రవికిరణ్ లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి, నిందితుడిని గుర్తించి, పట్టుకోవడం జరిగింది.ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చూపిన చాకచక్యం, నిబద్ధతకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్‌ఐ నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రవికుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు.