ముద్ర సంగారెడ్డి,మార్చి:
రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్ సముదాయ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను రాష్టమంత్రి దామోదర్ రాజనర్సింహ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కోటి రూ.4.9 లక్షల విలువ గల 20 హెచ్‌పి కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ,వ్యవసాయం మరియు ఉద్యాన రంగాల అభివృద్ధికి యాంత్రీకరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు.చిన్న,సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.రైతులు ఆధునిక పద్ధతులు, యంత్రాలను వినియోగించి సాగు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలని సూచించారు.రైతుల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని,రైతులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి అన్నారు. ఈకార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు,జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య,జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, డీఆర్‌డీఓ జ్యోతి తదితర జిల్లా అధికారులు,సంబంధిత లబ్ధిదారులు పాల్గొన్నారు.