ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గతేడాది పదోతరగతి మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పారితోషికం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్ర శాఖల పిలుపుమేరకు ఐక్య ఉపాధ్యాయ సంఘాల నేతలు సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల మూల్యాంకన కేంద్రంలో మధ్యాహ్న భోజన సమయంలో టీటీజేఏసీ, యూఎస్పీసీ, జాక్టో ఉపాధ్యాయ జేఏసీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పదో తరగతి మూల్యాంకనం, కులగణన విధులకు సంబంధించిన పారితోషికాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ స్పాట్ రేట్లను రెండుసార్లు పెంచిన ప్రభుత్వం, ఏడేండ్లుగా పదో తరగతి మూల్యాంకన రేట్లను పెంచలేదని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ స్పాట్ రేట్లను కనీసం 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్నకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు టీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేంద్రబాబు, రమణారావు, ఎస్టియు టిఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూమన్న యాదవ్, లక్ష్మణ్, టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు దాసరి శంకర్, టియుటిఎఫ్ అధ్యక్షులు తోడిశెట్టి రవికాంత్, టిపిటిఎఫ్ అధ్యక్షులు ఏ.విజయ్ కుమార్, డిటిఎఫ్ అధ్యక్షులు మహేంద్ర చారి, తపస్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, టిపిఆర్టియు నాయకులు రవిరాజ్, గంగాధర్, హరిహర నాథ్, టిఆర్టిఎఫ్ నాయకులు ప్రశాంత్, వ్యాయామ సంఘ నాయకులు రవీందర్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.