- ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును కొట్టేసిన కోర్టు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. 2021 నవంబర్‌లో ఆయనపై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును హైకోర్టు కొట్టివేసింది.ఈ కేసుపై కోర్టు సోమవారం విచారణ జరిపింది. 2021లో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో,నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.అదే సమయంలో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అప్పటి తహసీల్దార్ శేషగిరిరావు నవంబర్ 16న బండి సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్‌పహాడ్ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఆయన ఎన్నికల ప్రచార నిబంధనలను అతిక్రమించి, వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించగా ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లు నిరూపించబడలేదని బండి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు,ఈ కేసును సరైన సాక్ష్యాధారాల నిరూపణ లేని కారణంగా కొట్టివేసింది. బీజేపీ నాయకులు ఈ తీర్పును స్వాగతిస్తూ, ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని ఆరోపించారు.