Take a fresh look at your lifestyle.

నేరాలు చేస్తాం.. విచారించొద్దంటే ఎలా..?

ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి విచారణ చేయాలనడం కరెక్ట్ కాదు
మీరు చేసిన తప్పులకే అధికారులు నోటీసులు ఇచ్చారు
అక్రమాలకు పాల్పడిన ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే
ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసిన వారు జాతిపితలు ఎలా అవుతారూ..?
బీఆర్ఎస్ పాలనలో ఇబ్బందిపడని ఉద్యమకారుడు లేడు
పదేళ్లు తెలంగాణ ప్రజలను విస్మరించారు
రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

అధికారంలో ఉన్నాం కదా అని నేరాలు చేస్తాం.. విచారించొద్దంటే ప్రజాస్వామ్యంలో నడవదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా విచారణ ఎదుర్కొవాల్సిందేనన్నారు. ఆ తప్పు నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న సీఎం.. అప్పటి ముఖ్యమంత్రిగా ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉందన్నారు. ఈ కేసులో ఆయనను విచారించడానికి సిట్ అధికారులు నోటీసులు ఇస్తే.. తెలంగాణ జాతిపితకే నోటీసులు ఇస్తారా? అని బీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లు తెలంగాణ ప్రజలను విస్మరించన వాళ్లు, ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసిన వారు జాతిపితలు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం అని అడిగారు. బీఆర్ఎస్ పాలనలో ఇబ్బందిపడని ఉద్యమకారుడు లేడన్నారు. ఎంతో మంది ఉద్యమకారులను అరెస్టులు చేసి వేధించారని ఆరోపించారు. ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి.. బెడ్ రూమ్‌ల నుంచి ఈడ్చుకెళ్లిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు అవేమీ కనిపించడం లేదని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియంలో ప్రతిష్టాత్మక ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు-ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదవులు, రూ. వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారని సీఎం ప్రశ్నించారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని చెప్పారు. మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? అని నిలదీశారు. గతంలో తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా? అని దుయ్యబట్టారు. పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారన్నారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని సీఎం చెప్పారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారనీ.. మరోవైపు శిబు సోరెన్ లాంటి వాళ్లూ విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ దైవాంశ సంభూతుడేం కాదన్నారు. మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారన్న సీఎం… ఇప్పుడా మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లిందని చురకలంటిచారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలన్న ఆయన హుందాగా వ్యవహరిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడేదని కేసీఆర్ ను ఉద్దేశించి చెప్పారు. ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం ? ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం ? ఇదెక్కడి జాతిపిత లక్షణం? అన్నారు. కేసీఆర్ చేసిన తప్పులకే సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అయితే తాను ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి విచారణ చేయాలనడం కరెక్ట్ కాదన్న రేవంత్ రెడ్డి… అక్రమాలకు పాల్పడిన ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే అన్నారు. వచ్చిన తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులే పంచుకున్నారని సీఎం విమర్శించారు. స్వేఛ్ఛను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు వస్తుందన్నారు. ఆ ప్రజా తిరుగుబాటు సాయుధ పోరాటంగా మారుతుందని రావి నారాయణరెడ్డి చాటిచెప్పారని సీఎం వ్యాఖ్యానించారు. దేశంలో అధిక మెజారిటీతో గెలిచిన ఎంపీగా రావి నారాయణ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. ఆయన అన్ని పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకుడన్నారు. కానీ ఈ రోజుల్లో ప్రజలు ఓడించినా పదవులు వదులుకునేందుకు ఇష్టపడటంలేదని కేసీఆర్ ను ఉద్దేశించి చెప్పారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాసేలా ఎస్ ఐ ఆర్ ను తీసుకువచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ కేంద్ర కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందన్న సీఎం.. దీనిపై ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.