- 11 వేల గ్రామాల్లో 40 వేల మందికి పంపిణీ.
- సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం.
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 వేల గ్రామాల్లో 40 వేల మందికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు.పంపిణీలో రైతులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఆ వర్సిటీ అధికారులు చెప్పారు.విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా గ్రామాల్లో నాణ్యమైన విత్తన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వర్షాకాలం నేపథ్యంలో వ్యవసాయ శాఖకు విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ లు సంయుక్తంగా ముందుకు వచ్చి ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 89,302 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను ఆగ్రో రైతు సేవ కేంద్రాలలోనూ, అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంపిణీకి సిద్ధం చేశాయి.ఈ క్రమంలో ఇప్పటి వరకు 1,17,912 మంది రైతులు 56,262 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 33,040 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి.