- ఓరుగల్లు శివారున జాతర.
- 25 ఏండ్ల ఆవిర్భావ మహా సభ.
- భారీ స్థాయిలో ఏర్పాట్లు.
- ఓటమి తర్వాత భారీ సభ కావడంతో కీలకం.
- పార్కింగ్ కోసం వెయ్యికిపైగా ఎకరాలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 25ఏళ్ల క్రింత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమతి (టీఆర్ ఎస్ ), రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు దాదాపు దశాబ్దకాలం నూతన రాష్ట్రాన్ని పాలించి చరిత్ర సృష్టించింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే వ్యూహంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్న గులాబీపార్టీకి అధికారం దూరమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ దేశంలోనే అతిపెద్దగా సభగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభకు సుమారు 1,300 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. 400 మంది అతిథులు కూర్చునేలా బాహుబలి వేదిక ముస్తాబవుతున్నది. ఆ పార్టీ తలపెట్టిన ఆవిర్భావ సభకు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో సభ జరిగే ఎల్కతుర్తితోపాటు గ్రామగ్రామాన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈ సభకు గతంలో ఎన్నడూ లేనివిధంగా జన సమీకరణ చేపట్టుతోంది.అందుకే అదేస్థాయిలో ఏర్పాట్లను సైతం చేస్తోంది గులాబీ దళం.ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న ఈ భారీ సభ అత్యంత కీలకంగా మారింది.ఓటమి తరువాత ప్రజాసమస్యలపై విమర్శలకు కాస్త గ్యాప్ తీసుకున్న కేసీఆర్, వరంగల్ రజతోత్సవంలో మరోసారి తన మార్క్ వ్యూహత్మక రాజకీయ విమర్శలతో అధికారపార్టీకి చుక్కలు చూపించేందుకు సిద్దమైంది.
- పార్టీ వైభవం కనిపించేలా ఏర్పాట్లు.
వరంగల్ లో ఈనెల 27వ తేది జరగనున్న వేడకులకు గులాబీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి.తెలంగాణవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పదిలక్షల మందికి తక్కువ కాకుండా సభకు తరలించేందుకు బీఆర్ ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా శ్రమిస్తున్నారు.ఇప్పటికే ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ, బొట్టుపెట్టి మరీ వరంగల్ సభకు రావాలంటూ ఆహ్వానిస్తున్నారు.1213 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్దం చేశారు.లక్షలాదిగా జనం హారైనప్పటికీ ఎవరెక్కడ కూర్చున్నా వేదికపై జరుగుతున్న వేడుకలు, కేసీఆర్ ప్రసంగం సభాప్రాంగణం మొత్తం క్లారీటీగా కనిపించే విధంగా ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు.ఎండలు దంచికొడుతున్న వేళ సభా ప్రాంగణం మొత్తం చల్లటి వాతావరణం ఉండేలా టెంట్లు, కూలర్లతోపాటు అత్యాధునిక టెక్నాలజీని వాడిని ఎండవేడి నుంచి కార్యకర్తలకు రక్షణ కల్పించేలా సర్వం సిద్దం చేశారు. ఇదిలా ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేడుకలు జరిగే అవకాశం ఉండటంతో ఎండ వేడిని తట్టుకునేందుకు 10లక్షల మజ్జిన ప్యాకెట్లు పంచేందేందుకు ఏర్పాట్లు చేశారు.తాగునీటికి సమస్య లేకుండా ఏకంగా 10లక్షల వాటర్ బాటిల్స్ తెప్పించారు. ఇంకా అవసరమైతే వాటర్ బాటిల్స్ తెచ్చేందుకు గులాబీ టీమ్ సిద్దమైంది.
- పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
బీఆర్ఎస్ రజతోత్సవం కోసం తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా వాహానాలు తరలి వస్తాయి అందుకే పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఏకంగా పార్కింగ్ కోసం వెయ్యి ఎకరాలు కేటాయించారు.వాహనాలు పార్కింగ్ చేసుకుని, నేరుగా సభాప్రాంగణం వద్దకు చేరుకునేలా, తొక్కిసలాటకు అవకాశం లేకుండా భారీ కేడ్లను ఏర్పాటు చేశారు.ఒకేసారి వేదికపై 500 మంది బీఆర్ ఎస్ నాయకులు కూర్చునేలా అత్యంత భారీ ఏర్పాట్లు సిద్దం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లతో సెల్పీలు దిగే ముచ్చట తీర్చేందుకు ప్రత్యేకంగా సభా ప్రాంగణంలో సెల్పీ బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యుత్ కోతల ప్రభావం ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఉందని, తమకు విద్యుత్ సరఫరా పై నమ్మకంలేదంటూ ఏకంగా 200 జనరేటర్లను సిద్దం చేశారు. అనారోగ్య సమస్యలు, వడదెబ్బ వంటివి తలెత్తినప్పుడు వెంటనే వైద్య సదుపాయం అందించేందు 100కి పైగా వైద్య బృందాలను సభప్రారంగణంలో అందుబాటులో ఉంచారు.అత్యవసర సమయంలో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించేందకు 20 అంబులెన్స్ లు సైతం ఏర్పాటు చేశారు.తాత్కాలిక టాయిలెట్స్, సభకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు 2వేలమంది వాలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఇలా చెప్పుకుంటే పోతే బీఆర్ ఎస్ రజతోత్సవాన్ని ఓ మహాజాతరలా జరిపేందుకు గులాబీ దళం సన్నద్ధమైంది.
- రండి..
గ్రామాల్లో పార్టీ జెండా గద్దెల నిర్మాణం, పోస్టర్లు విడుదల చేయడం, గోడలపై రాతలు, జెండాల ఆవిష్కరణలతో పార్టీ శ్రేణులు బిజీబిజీ అయ్యాయి.రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎల్కతుర్తి సభ రికార్డు సృష్టిస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎల్కతుర్తిలో జరిగే సభ కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే 12 వందలకుపైగా ఎకరాల్లో రైతుల నుంచి అనుమతి, నిరభ్యంతర పత్రాలను తీసుకున్నది.మరో వంద ఎకరాల వరకు కూడా రైతుల నుంచి నిరభ్యంతర పత్రాలను తీసుకోనున్నది. ఈ మొత్తం భూమిలో సుమారు 200 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉండనున్నది.ఇక్కడ వేదికపైన ఉన్నవారు వేదిక చుట్టూ ఎక్కడి నుంచి చూసినా కనిపించేలా ఏర్పాట్లు చేశారు.సభాస్థలిలో అతిపెద్ద వేదికను నిర్మిస్తున్నారు.400 మందికిపైగా అతిథులు కూర్చునేలా సభా వేదికను నిర్మిస్తున్నారు.అదనంగా సెక్యూరిటీ సిబ్బంది, వాలంటీర్లు వేదికపై ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఒకరకంగా చెప్పాలంటే ఇది బాహుబలి వేదికగా ఉంటుందని వేదిక నిర్మిస్తున్నవారు చెప్తున్నారు.ఇక, సభకు వచ్చే ప్రజలు, కార్యకర్తల సౌకర్యార్థం పార్టీ 3వేలకుపైగా ఆర్టీసీ బస్సులను బుక్ చేసింది.దీనికి సంబంధించిన రూ.8 కోట్లను ఆర్టీసీకి చెల్లించింది. వీటితోపాటు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన మూడువేలకుపైగా బస్సులను బుక్ చేశారు.మరో నాలుగు వేల బస్సులను స్కూళ్లు, వివిధ సంస్థల నుంచి తీసుకుంటున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రారంభమవుతున్నందున ప్రైవేటు విద్యాసంస్థలు, ఇతర సంస్థల నుంచి వీటిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- జాతరకు మొదలయ్యారు.
ఉద్యమనాటి పరిస్థితులను గుర్తు చేస్తూ పార్టీ శ్రేణులు, ప్రజలు అప్పుడే ఎల్కతుర్తి సభకు దండుగా కదలడం మొదలుపెట్టారు.సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ వాసులు ఎడ్లబండ్లతో తమ ప్రయాణం మొదలుపెట్టారు.అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు ఔత్సాహికులు కూడా బయల్దేరారు.ఆయా జిల్లాల నుంచి వచ్చేవారు మార్గమధ్యంలో ఉండే గ్రామాల్లోని ప్రజలకు సభ గురించి చాటింపు చేస్తూ..చైతన్యం చేస్తూ వెళ్లాలని భావిస్తున్నారు.
