స్వామివారి పాదాలను తాకిన భానుడి కిరణాలు..
శ్రీ స్వామివారికి ఘనంగా తిరుప్పావడ సేవ..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం ఉదయం సరిగ్గా 7:00 గంటలకు సూర్య భగవానుడి కిరణాలు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి, స్వామివారి పాద పద్మాలను స్పర్శించాయి.
గతంలో భీష్మ ఏకాదశి నాడు జరిగిన ఈ అపురూప ఘట్టం, నేడు మళ్ళీ పునరావృతమైంది. ఇది ఆలయ నిర్మాణ కౌశలానికి, ఆధ్యాత్మిక రహస్యానికి నిదర్శనమని భక్తులు కొనియాడారు. సూర్య కిరణాల వెలుగులో స్వామివారి దివ్య మంగళ స్వరూపం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించిన భక్తులు భక్తిపరవశంలో మునిగిపోయారు.
ఈ ‘సూర్య కిరణార్చన’ మరో రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 20, 21 తేదీల్లో) కూడా ఉదయం 7:00 గంటలకు జరగనుంది. ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణ గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం. స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని,లడ్డు,వడ,తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూరమంగళ హారతులు సమర్పించారు.
ఉదయం 10:30 లకు విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి మరియు సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.