శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో, అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ చేశారు.
సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. సహస్ర నామార్చన సేవ, శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. మృగశిర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.

ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం మాడవీధులలో శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.