ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఆ మేరకు క్రీడా పాలసీకి రూపకల్పన-క్రీడాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా క్రీడా మైదానాలు
క్రీడాకారులకు మెరుగైన శిక్షణ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చే స్ధాయికి తెలంగాణ ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆ మేరకు క్రీడా ప్రణాళికలు రూపోందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని క్రీడాకారులకు ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో క్రీడాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణాల డిజైన్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన.. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలకు అనువుగా మైదానాల ఏర్పాటుపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులను మరింత ప్రోత్సహించాలని అదికారులను ఆదేశించారు. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ చూపించేలా వారికి సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించిన ఆయన ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న మైదానాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా వారిని తీర్చిదిద్దాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం.. ఎల్‍బీ స్టేడియం.. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలను ఆధునీకరించాలని పేర్కొన్నారు. ఈ క్రీడాశాఖ సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.