- ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో విశ్వాసం కలిగించింది.
- ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలి.
- ఆర్టీసీలో యూనియన్లు నడిపే హక్కును అనుమతించాలి.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సహనానికి మారుపేరైన భారత దేశానికి శాశ్వతంగా ఉగ్రవాదం నుంచి విముక్తి కలగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.ఆపరేషన్ సిందూర్ భారత ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించిందన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చి, కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని ఆయన కోరారు.కాశ్మీర్‌లో నెలకొన్న సున్నితమైన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అక్కడ ఎందరో అమాయకులు బలైపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీల సలహాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి ఆయన సూచించారు. కచ్చితంగా చెడును నియంత్రించి, న్యాయాన్ని బతికించుకోవాలన్నారు. పాకిస్థాన్, పీవోకే ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, ఆపరేష్ సిందూర్ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని, ఉగ్రవాదానికి మతం, కులం లేదన్నారు.ఈమేరకు బుధవారం హైదరాబాద్ లో మీడియాతో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడారు.. మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.మావోయిస్టులు చర్చలకు సిద్దమని ప్రకటిస్తే, కేంద్రమంత్రులు చర్చలకు ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.కర్రెగుట్టలో 22 మంది మావోయిస్టుల ప్రాణాలనుప తీశారని, ఇంకా ఎంతమంది మావోయిస్టులను చంపితే మీ రక్తదాహం తీరుతుందని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు.ఆపరేషన్ కగార్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి రేవంత్ రెడ్డి సర్కార్ సానుకూలంగా ఉందన్నారు.అయితే ఆర్టీసీలో యూనియన్లను నడిపే హక్కు ప్రభుత్వానికి కల్పించాలన్నారు.యూనియన్లను నడిపే హక్కు బ్రిటీష్ వారి పాలన కాలం నుంచి ఉందన్నారు. అయితే గతంలో కేసీఆర్ సర్కార్ ఆర్టీసీలో యూనియన్లను నడపకుండా అడ్డుకుందని ఆయన మండిపడ్డారు. యూనియన్ల విషయంలో గత కేసీఆర్ సర్కార్ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహించాలని ఆయన కోరారు. గత బీఆర్ఎస్ కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మెరుగని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు కమిటీ వేస్తామని ప్రకటించిందన్నారు.ఉద్యోగుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను దాచుకుని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న సమస్యలన్నింటకీ మూలకారణం బీఆర్ఎస్ నేతలేనని కూనంనేని ఆరోపించారు.